{"source":"other","uid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1643008489481","origin":"gallery","is_remix":false,"used_premium_tools":false,"used_sources":"{"sources":[],"version":1}","premium_sources":[],"fte_sources":[]}

కోలార్: వాళ్లిద్దరూ పదేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. ఆ యువతి అతనినే సర్వస్వం అని నమ్మింది. ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ, ఇంతలోనే ఆ యువకుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఆమెతో ఇన్నాళ్లు శారీరకంగా కలిసి తీరా మోజు తీరిపోవడంతో ఇంట్లో పెద్దలు తీసుకొచ్చిన పెళ్లి సంబంధానికి ఓకే చెప్పాడు నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ విషయం ఆమెకు తెలిసి, పూర్తి వివరాల్లోకి వెళితే: కోలార్ తాలూకా అరభికొత్తనూర్‌ గ్రామానికి చెందిన అంబికా, మహేష్ గత పదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అంబికా అతనిని పూర్తిగా నమ్మడంతో ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. తప్పకుండా పెళ్లి చేసుకుంటానని మహేష్ చెప్పడంతో ఆ శారీరక సంబంధం ఇన్నేళ్లుగా కొనసాగింది. అంబికా కూడా అతనిని పూర్తిగా నమ్మడంతో అడ్డు చెప్పలేదు. కానీ మహేష్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని అంబికాకు మాటిచ్చి, పెద్దలు కుదిర్చిన సంబంధం తాలూకా అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అంబికాకు ఈ విషయం తెలిసి మహేష్‌ను నిలదీసింది.

తనతో ఇన్నాళ్లు చనువుగా ఉండి, ప్రేమించినట్టు నటించి ఇలా చేయడానికి మనసెలా వచ్చిందంటూ కడిగిపారేసింది. మహేష్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో రేప్ కేసు పెట్టింది. మహేష్ జైలుకెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన మహేష్ చివరికి అంబికాను పెళ్లి చేసుకున్నాడు. కానీ, పెళ్లి చేసుకున్న రోజు నుంచి కనిపించకుండా పోయాడు. ఎక్కడికి వెళ్లాడో కూడా తెలియదు. ఫోన్‌లో అందుబాటులో కూడా లేడు మహేష్ ఇంటి ముందు అంబిక న్యాయపోరాటానికి దిగింది. పోలీసులు కూడా మహేష్ కుటుంబం ఇచ్చిన డబ్బు ముట్టడంతో తనకు న్యాయం చేసేందుకు ముందుకు రావడం లేదని అంబిక ఆరోపిస్తోంది. ఆ కేసు నుంచి బయటపడేందుకే మహేష్ అంబికను పెళ్లి చేసుకున్నాడని ఆమె తండ్రి చెప్పాడు. మహేష్, అతని కుటుంబం కలిసి తన కూతురికి అన్యాయం చేయాలని చూస్తున్నారని పోలీసులే న్యాయం చేయాలని ఆమె తండ్రి కోరాడు. మహేష్‌కు అతని కుటుంబం గుట్టుచప్పుడు కాకుండా మరో పెళ్లి చేసే ప్రయత్నంలో ఉన్నారని, అదే జరిగితే తన కూతురికి, తనకూ ఆత్మహత్యే శరణ్యమని అంబిక తండ్రి కన్నీరుమున్నీరవుతున్నాడు. ఈ సమస్యపై బాధితురాలు ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసింది.