హైదరాబాద్‌ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి ముందు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు. తెలంగాణ ఉద్యమకారులు, అమర వీరుల త్యాగాలను అవహేళన చేసేలా మాట్లాడారంటూ పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద, జనసేన తెలంగాణ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. పవన్ తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన కార్యకర్తలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై స్పందించిన జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా వివరణ పోస్ట్ చేశారు. భీమవరం పర్యటనకు వెళుతూ రాజమండ్రిలో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ‘మద్య నిషేధం ఎలా కష్టసాధ్యమైన ప్రక్రియో చెప్పేందుకే సాయుధ పోరాట ఉద్యమ కాలం నాటి విషయాన్ని ఉటంకించాను. పోరాటాన్ని అణిచేందుకు మద్య నిషేధాన్ని వాడుకున్నా సాధ్యం కాని విషయాన్ని అప్పటి చరిత్రను చెప్పే రచనలు చూడవచ్చు’ అంటూ పవన్ చెప్పిన మాటను జనసేన ట్వీట్ చేసింది.