పెళ్లయిన పుష్కరకాలానికి ఆమె కడుపు పండింది. పిల్లలు లేరనే బాధను దూరం చేసుకుంటూ పండంటి మగ బిడ్డను కనింది. కుటుంబమంతా ఆనందోత్సాహాలు జరుపుకొంటుండగా అనూహ్య కారణంతో ఆ బాలింత ఆస్పత్రి బాత్రూమ్‌లో బలవన్మరణానికి పాల్పడింది. ఆమె చావుకు కారణం వైద్య సిబ్బంది నిర్లక్షమేనని కుటుంబీకులు ఆందోళనలకు దిగారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. వివరాలివి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రొంపికుంటకు చెందిన ఉమ అనే మహిళకు 2009లో వివాహం జరిగింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో ఆమె గర్భవతి అయింది. నెలలు నిండటంతో కుటుంబీకులు ఆమెను పెద్దపల్లి ఆస్పత్రికి తీసుకొచ్చారు. డిసెంబర్ 11న ఉమ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. సాధారణ ప్రసవం సాధ్యం కాకపోవడంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీశారు. సిజేరియన్ కుట్ల వేసిన కారణంగా 10 రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని డాక్టర్లు సూచించారు.

అయితే సిజేరియన్ కుట్లు సరిగా పడకపోవడంతో ఆమెకు విపరీతమైన నొప్పి కలిగింది. డాక్టర్లకు చెప్పడంతో 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి కుట్లు వేశారు. కానీ కుట్ల నొప్పులు తగ్గకపోగా ఇంకా పెరిగాయి. రెండోసారి వేసిన కుట్లు కూడా సరిగా లేకపోవడంతో సోమవారం మళ్లీ ఆమెకు కుట్లు వేయాలని వైద్యులు నిర్ణయించారు. అయితే ఆ గాయాల బాధ తట్టుకోలేక ఉమ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఆస్పత్రిలోని బాత్రూమ్ లో ఆత్మహత్య చేసుకొంది. ఉదయం బాత్రూమ్ శుభ్రం చేయడానికి వెళ్లిన సిబ్బంది అక్కడ వేలాడుతోన్న ఉమను చూసి షాకయ్యారు. సిజేరియన్ గాయాల నొప్పి భరించలేకే ఉమ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వలనే ఉమ చనిపోయిందంటూ కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.