కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార కమిటీ (సీడబ్ల్యూసీ) గురువారం భేటీ కాబోతోంది. సాయంత్రం 5.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కోవిడ్ నుంచి కోలుకోగానే సీడబ్ల్యుసీ సమావేశం జరగనుండటంతో ఈ మీటింగ్‌పై పార్టీ శ్రేణుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ భేటీకి పార్టీ జనరల్ సెక్రటరీలు, పలు రాష్ట్రాల ఇంఛార్జ్‌లు హాజరుకాబోతున్నారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్‌ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ నేతృత్వంలో ఉన్నత స్థాయు సమావేశం జరగనుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌ఘడ్‌ సీఎం భూపేష్‌ బఘేల్‌, ప్రత్యేక ఆహ్వానితులుగా రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ పీసీసీ అధ్యక్షులు, యూపీ ఇంఛార్జ్‌ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ కూడా పాల్గొనన్నారు.

ఆగస్టు 28న భారీ ర్యాలీ:

దేశంలో అంతకంతకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆగస్టు 28న రాంలీలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించనున్న భారీ ర్యాలీపై ఇవాళ్టి మీటింగ్‌లో చర్చించే అవకాశాలు ఉన్నారు. నిరసన కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ ఏర్పాట్లు, అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొనాల్సిన పార్టీ ప్రతినిధులు, కార్యాచరణను పార్టీ ఉన్నతస్థాయి సమావేశంలో ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై కూడా ఈ సమావేశంలో చర్చజరగనుంది. నిజానికి రాహుల్ గాంధీ యాత్ర అక్టోబర్ 2 నుంచి ప్రారంభించాలని తొలుత నిర్ణయం తీసుకున్నా.. తర్వాత సెప్టెంబర్ 7 నుండి మొదలు పెట్టాలని నిర్ణయించారు. సెప్టెంబర్ మొదటి వారంలో సీడబ్ల్యూసీ కమిటీ సమావేశం కానుంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది.

టీ-కాంగ్రెస్‌లో కీలక మార్పు?:

నేడు జరగబోతున్న సీడబ్ల్యూసీ సమావేశంపై టీ-కాంగ్రెస్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ప్రియాంక గాంధీని నియమించబోతున్నారనే టాక్ ఇటీవల జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుత ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ స్థానంలో ప్రియాంక గాంధీకి ఆ పగ్గాలు అప్పగించాలనే యోచనలో అధిష్టానం ఉందని సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి సమావేశంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న మాణిక్కం ఠాగూర్‌ను కొనసాగిస్తూనే ఆయనపై పర్యవేక్షణ బాధ్యతల్లో ప్రియాంక ఉంటారా లేక నేరుగా ఆమె రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తారా? అనేదానిపై స్పష్టత లేదు. దాంతో నేడు జరగబోతున్న పార్టీ పెద్దల మీటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.