ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం పలు మలుపులు తిరిగి చివరకు ఓ మహిళ జీవితంలో విషాదం మిగిల్చింది. గుంటూరు జిల్లా సీతానగరానికి చెందిన ఓ యువతికి మంగళగిరి చెందిన యువకుడితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. అనంతరం మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను వదిలించుకునేందుకు ప్రణాళిక రూపొందించి ఆమెకు హెచ్‌ఐవీ సోకే విధంగా ఓ ఆర్‌ఎంపీతో వైద్యం చేయించినట్లు ఆ వివాహిత గురువారం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం: సీతానగరానికి చెందిన యువతి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన మంగళగిరి చెందిన ముప్పెర చరణ్‌కుమార్‌ను 2015లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఒక పాప. పాప పుట్టిన అనంతరం ఆమెను చరణ్‌కుమార్‌ శారీరకంగా దూరం పెట్టడమే కాకుండా ఇంటికి కూడా రావడం మానేశాడు.

పిల్లలు పుట్టిన తరువాత నీకు అనారోగ్యంగా ఉంది వైద్యం చేయిస్తానంటూ మంగళగిరి చెందిన ఆర్‌ఎంపీతో ఆమెకి పలుసార్లు ఇంజక్షన్లు చేయించాడు. కొంత కాలం తరువాత వైద్య పరీక్షలు చేయించుకోగా హెచ్‌ఐవీ ఉందని తేలింది. ఆసుపత్రి నుంచి అదే విషయాన్ని తన భర్త చరణ్‌కుమార్‌కు తెలిపింది. దీంతో అతను ఇంటికి వచ్చి నాకు హెచ్‌ఐవీ లేదు, నీకు హెచ్‌ఐవీ ఉంది. నావల్లే పొరపాటు జరిగింది. నన్ను క్షమించు, జీవితాంతం నిన్ను చూసుకుంటానని చెప్పాడు. ఈ నేపథ్యంలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నన్ను వదిలించుకోవడానికే హెచ్‌ఐవీ ప్రయోగం చేశాడని, జరిగిన ఈ సంఘటనపై తాడేపల్లి పోలీసులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. పోలీసులు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విష ప్రయోగం కింద, మోసగించినందుకు, కులాన్ని ప్రస్తావించినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.