హోటల్ రూమ్ బుకింగ్ సేవలు అందించే ఓయోకు మంచి డిమాండ్ ఉంది. ఇది భారత్‌తో పాటు విదేశాల్లోనూ సేవలు అందిస్తుంటుంది. ఇక ముఖ్యమైన రోజుల్లో, పండగల సమయాల్లో, ఇతర సెలవుల్లో ఓయో రూమ్స్‌కు డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పర్యటకులు, ప్రేమ జంటలు, సాధారణ ప్రజలు ఇలా అందరికీ అందుబాటు ధరల్లో హోటల్ రూమ్స్ ఓయోలో లభ్యం అవుతాయి. ఇక ఇటీవల కొత్త సంవత్సరం నేపథ్యంలో డిసెంబర్ 31న రికార్డు స్థాయిలో ఒక్క రోజే ఏకంగా 4.5 లక్షల ఓయో రూమ్ బుకింగ్స్ జరిగాయి. గత ఐదేళ్లలో ఇదే అత్యధికం. ఇక ఇది బిజియెస్ట్ డే ఆఫ్ ది ఇయర్‌గానూ నిలిచింది. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా కూడా ఓయోకు మంచి గిరాకీ వచ్చింది. ప్రేమికుల రోజున ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటారు. ఇక ఈ రోజున పెళ్లైన వారు, ప్రేమ జంటలు ఈ స్పెషల్ డేను వెరీ వెరీ స్పెషల్‌గా జరుపుకోవాలని, ప్రత్యేకంగా నిలుపుకోవాలని కోరుకుంటారు. దీంతో హోటల్స్, రెస్టారెంట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఒక్కసారి మిస్ అయితే మళ్లీ ఈరోజు కోసం సంవత్సరం వేచి చూడాలి. అందుకే యాప్ బేస్డ్ హోటల్ బుకింగ్ యాప్ ఓయోకు తెగ డిమాండ్ వచ్చింది.

ఇక ఈసారి వాలెంటైన్స్ డేను పురస్కరించుకొని ఓయో రూమ్ బుకింగ్స్ గతేడాది కంటే ఏకంగా 35 శాతం పెరిగాయని హాస్పిటాలిటీ మేజర్ ఓయో చెప్పుకొచ్చింది. ఇంకా ఈసారి ఫిబ్రవరి 14 వీక్ డే అయినప్పటికీ ఇంత డిమాండ్ చూసి ఓయో యాజమాన్యం ఆశ్చర్యపోతోంది. కంపెనీ డేటా ప్రకారం వాలెంటైన్స్ డే రోజున ఎక్కువగా ఓయో రూమ్స్ ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని బృందావనంలోనే నమోదయ్యాయట. ఇక్కడ ఏకంగా గతేడాదితో పోలిస్తే 231 శాతం పెరగడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో 51 శాతం పెరుగుదలతో బెంగళూరు, 47 శాతం పెరిగి హైదరాబాద్, 38 శాతం పెరుగుదలతో కోల్‌కతా ఉండగా తర్వాతి స్థానాల్లో చెన్నై, ముంబయి ఉన్నాయి. ఇక ప్రసిద్ధ పర్యటక ప్రదేశాలైన గోవా, మనాలీ వంటి ప్రాంతాలను దాటి బృందావనం తొలి స్థానంలో నిలవడం అందరినీ ఆశ్యర్యపరిచింది. ఇక 2022లో సగటున వాలెంటైన్స్ డే సమయంలో ఓయో రూమ్స్‌లో 2 రోజులు ఉండగా ఈ ఏడాది అది 4 రోజులకు పెరిగిందంట. కుటుంబంతో, స్నేహితులతో, తమకు ఇష్టమైన వారితో గడిపేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని, ముఖ్యంగా వారాంతాలు కాకపోయినా జనం వస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు ఓయో ప్రతినిధి. మధ్యతరగతి జనం కూడా ఖర్చుకు వెనుకాడట్లేదని చెప్పుకొచ్చారు.