బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలపై బండికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కవితపై వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవల పంజాగుట్టలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసనలు చేపట్టారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. అనంతరం కవితపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని దానం నాగేందర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బండిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో బండిపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో బండిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.

అంతే కాకుండా బండికి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీంతో శనివారం బండి కమిషన్ ముందు హాజరయ్యారు. కవితపై చేసిన వ్యాఖ్యలపై లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని, తెలంగాణ సామెతలను ఉపయోగించాల్సి వచ్చిందని చెప్పారు. దీంతో ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని మహిళా కమిషన్ చెప్పినట్లు సమాచారం. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. నిన్న మహిళా కమిషన్ ముందు హాజరైన క్రమంలో ఇవాళ పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయడం చర్చకు దారితీస్తోంది. కవితపై చేసిన వ్యాఖ్యలకు బండి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తోన్నారు. అయినా బండి మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. కావాలనే బండి వ్యాఖ్యలను బీఆర్ఎస్ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని కాషాయ నేతలు విమర్శిస్తున్నారు.