అవినీతి అధికారిని లావణ్యను
ఏసీబీ రేపు కస్టడీలోకి తీసుకొని విచారించనున్న వ్యవహారంతో హల్చల్ మొదలయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ చంచల్ గూడ జైల్లో ఉన్న లావణ్యను ఎసిబి అధికారులు రెండు రోజుల పాటు విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఎసిబి అధికారులు ఆశ్రయించారు. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు ఈ తాజా అంశంతో జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కేశంపేట తహసిల్దార్ లావణ్య ఆదాయానికి మించిన నగదు, ఆస్తులు కూడగట్టిన నేపథ్యంలో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఎసిబి అధికారులకు అడ్డంగా చిక్కిన విఆర్వో ఆనంతయ్య వ్యవహారంతో తీగ లాగితే డొంక కదులుతుంది. రాష్ట్ర స్థాయిలో సైతం ఈ సమాచారం కలవరం రేపింది. తాజాగా అవినీతి నిరోధక శాఖ అధికారులు లావణ్యను పూర్తిస్థాయిలో విచారించేందుకు ఏసీబీ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరడంతో న్యాయస్థానం ఏసీబీ కోరికను మన్నించింది. ఈ వ్యవహారంతో తహసిల్దార్ లావణ్య నోరు విప్పనున్నారు.

అసలు కేశంపేట మండలంలో ఏం జరిగింది? ఎవరి రాజకీయ ప్రోత్సాహం? ఎవరు అండదండలు అందించారు? ఎలాంటి భూములను ఎలా రికార్డుల్లో మార్పిడులు జరిగాయి? దీనికి ఎవరు వత్తాసు పలికారు? ఏ పొలానికి? ఏ రికార్డు కు ఎంత దండుకున్నారో ? వాస్తవాలు వెలుగుచూడనున్నాయి. వాస్తవానికి లావణ్య ఒక్కరే ఇంత పెద్ద మొత్తంలో అవినీతి అక్రమాలు చేసే ఆస్కారం లేదని ఉన్నత అధికారులతో సహా ప్రజలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఎవరి అండ చూసుకుని ఎవరి సహకారంతో లావణ్య ఇంత పెద్ద మొత్తంలో అవినీతి అక్రమాలకు పాల్పడిందో ఏసీబీ ఇంటరాగేషన్లో తెలియనుంది. ముఖ్యంగా లావణ్యను కొందరు బలిపశువును చేశారని సంబంధిత శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. లావణ్యను ఉద్యోగ నిర్వహణలో వత్తిడిలు తెచ్చి, ప్రలోభాలకు గురి చేయడం,
ఆమెను పూర్తిగా అవినీతి అక్రమాల వైపు నడిపించిన ఘనులు ఎవరన్న చర్చ ఇప్పుడు జోరుగా మొదలైంది. బలిపీఠంపై లావణ్యను ఎక్కించి ఆ తర్వాత తమకేమీ సంబంధం లేనట్టు దూరంగా ఉన్న వ్యక్తుల వ్యవహారం ఇప్పుడు ఎసిబి విచారణలో వెల్లడి కాబోతుంది. అయితే పెద్ద మొత్తంలో నగదు, విలువైన డాక్యుమెంట్లు లావణ్య వద్ద తదితర పత్రాలు ఏసీబీకి లభించాయి. అవి ఆమెకు సంబంధించినవా లేక ఎవరైనా ఆమెను బినామిగా వాదుకున్నారా? అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగనున్నట్లు తెలుస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో నగదు ఇంట్లో దాచుకోవడం ఏమిటనే? అనుమానాలు మొదలవుతున్నాయి.

అక్రమ పద్ధతుల్లో సంపాదించిన డబ్బులను పంపకాల కోసం ఏమైనా లావణ్య వద్ద ఉంచారా? అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. కేశంపేట తాసిల్దార్ లావణ్య వ్యవహారం రెవెన్యూ శాఖకు ఒక మాయని మచ్చ గా మారింది. రెవెన్యూ శాఖ ప్రక్షాళన చేస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం దీనికి సమ్మతించని రెవెన్యూ యంత్రాంగం ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో అవినీతి చూసిన తర్వాత ఉద్యోగ సంఘాలు కూడా నోరుమెదపని పరిస్థితి నెలకొంది. అయితే ఒకటి మాత్రం నిజమని లావణ్య ఒక్కరే ఇంత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడే అవకాశం లేదని ఆమె వెనక ఏ అధికారులు ఉన్నారు? ఏ నాయకులు ఉన్నారు? ఏ దళారీలు,తాబేదార్లు ఏ ముసుగులో ఉన్నారో? తెలిస్తే ప్రజలకు బాగుంటుందని కోరుకుంటున్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపితే భవిష్యత్తులో లావణ్యలా అధికారులు మరెవరు బలిపశువులు అయ్యే అవకాశం ఉండదని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ లావణ్య వ్యవహారంలో ఏసీబీ నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సిద్ధమయింది. రేపు, ఎల్లుండి లావణ్య ఇంటరాగేషన్లో వాస్తవాలు చెప్పడం జరిగితే కొందరి నిజ స్వరూపాలు బయట పడనున్నాయి. ఆమెను రాజకీయంగా ఒత్తిడి చేసినవారెవరు? అక్రమాల వైపు నడిపించింది ఎవరు? అసలు ఆ “జాతక రత్నాలు” ఎవరు? అన్న విషయాలు వెలుగులోకి రావడం ఖాయం.