ఆన్‌లైన్‌ లాటరీ ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది. తమిళనాడులోని విల్లుపురంలో ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్‌లైన్‌లో లాటరీ టికెట్లు కొని, ఆర్థిక ఇబ్బందులు భరించలేక బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. అరుల్‌ అనే ఆభరణాల వ్యాపారి విల్లుపురం సిద్ధేరి సమీపంలోని సలామత్‌ అనే పట్టణంలో భార్య, ముగ్గురు కూతుళ్లతో కలిసి నివాసముంటున్నాడు. తరచూ లాటరీ టికెట్‌ కొంటుండేవాడు.

దీనితో కుటుంబం తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో మానసిక వేదనకు గురైన అరుల్‌ తన భార్య, ముగ్గురు పిల్లలు సైనైడ్‌ ఇచ్చి తానూ తీసుకొన్నాడు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఉదంతాన్ని అతడు తన చరవాణిలో చిత్రీకరించాడు. అనంతరం దాన్ని విశ్వకర్మ ట్రేడ్‌ యూనియన్‌ మెంబర్స్‌తో షేర్‌ చేశాడు. దీన్ని చూసిన వెంటనే కొంత మంది అరుల్‌ ఇంటికి చేరుకున్నారు. తలుపులు బద్దలుకొట్టుకొని లోపలికి ప్రవేశించారు. అప్పటికే ఐదుగురు విగతజీవులుగా పడిఉన్నారు. వెంటనే మృతదేహాల్ని శవపరీక్ష నిమిత్తం విల్లుపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.