అంజలి అనే ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి కొన్ని నిమిషాల ముందు తన ఇద్దరు పిల్లలతో కలిసి సెల్ఫీ దిగింది. అదే ఫొటోను వాటాప్స్‌ డీపీలో పెట్టుకుంది. భర్త వేధింపులతో మనస్తాపానికి గురైన అంజలి మం గళవారం మజాలో పురుగుల మందు కలిసి ఇద్దరు పిల్లలకు తాగించి, తాను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ తరువాత కొద్దిసేపటికే పెద్ద కుమారుడు అనిరుధ్‌ వాంతి చేసుకున్నాడు. అప్పటికే తమ్ముడు అమృత్‌తేజ్‌తోపాటు తల్లి అం జలి కిందపడి నురగలు కక్కుతుండటంతో అతను చుట్టుపక్కలో ఉన్న వారికి చెప్పాడు. స్థానికులు వారిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు వారిని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యం లో అంజలి మృతి చెందింది. అమృత్‌తేజ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు గాంధీ వైద్యులు తెలిపారు.

కాగా భర్త వేధింపులు భరించలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు అంజలి తన సూసైట్‌నోట్‌లో పేర్కొంది. భర్త వేధింపులు తాళలేక గతంలో చిలకలగూడ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించినా ప్రసాద్‌ వైఖరిలో మార్పు రాకపోవడంతో బేగం పేట మహిళా పోలీస్‌ స్టేషన్‌కు రెఫర్‌ చేశారు. అంజలి ఫిర్యాదు మేరకు గత నెల 15న పోలీసులు ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు. మృతురాలి తల్లి కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. బేగంపేట పోలీసులు నిందితుడు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.