బీజేపీలో మార్పు రాకపోతే ప్రజలే బీజేపీని మారుస్తుస్తారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఐదేండ్లకొకసారి వచ్చే ఎన్నికలే ప్రజల ఆకాంక్షకు అద్దం పడుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను అందించని రోజున ఆ ఎన్నికలే మార్పు ను తీసుకొస్తాయన్నారు. ఆదివారం జిల్లాలోని నారాయణపురం మండలం గుడిమొల్కాపూర్, చిమిర్యాల మునుగోడు మండలం జమిస్తాన్ పల్లిలో లబ్ధిదారులకు దళిత బంధు పథకంలో భాగంగా పది కోట్ల రూపాయల విలువ చేసే వాహనాలను పంపిణీ చేశారు. అలాగే పలువురికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూః

వరుసగా ఎనిమిదేండ్ల మోదీ పాలనలో విధ్వంసాలు తప్ప ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎజెండాను రూపొందించాలన్న ప్రతిపాదనతో కమలనాథులు వణికిపోతున్నారని అన్నారు. హస్తినకు ప్రయాణం అన్న మాటలు సీఎం కేసీఆర్ నోటి వెంట వచ్చాయో లేదో కమలనాథుల దండు భాగ్యనగరం మీద జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో దండయాత్రకు దిగిందని ఆరోపించారు. అనంతరం మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్‌ ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పసుపు కుంకుమ కట్నం కింద సొంత నిధులతో చీరలను అందించారు.