తెలంగాణ విద్యార్థి 40,000 మంది విద్యార్థులకు నాయకుడుగా జాతీయ స్థాయిలో ఎన్నికైన ఎన్నంశెట్టి అఖిల్ బ్రిటన్ లో ప్రతి ఏటా జరిగే కీలక జాతీయ విద్యార్థి సంఘం ( నేషనల్ యూనియన్ ఆఫ్ స్టూడెంట్స్ ) ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎన్నంశెట్టి అఖిల్ ఘన విజయం సాధించారు . ఈ ఎన్నిక ద్వారా అఖిల్ స్కాట్లాండ్ లోని ప్రతిష్టాత్మక ఎడింబర్గ్ విశ్వవిద్యాలయంలో ఉన్న దాదాపు 40,000 మంది విద్యార్థులకు జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించనున్నారు .

బ్రిటన్ దేశంలోని అత్యున్నత విద్యార్థి మండలి అయిన నేషనల్ యూనియన్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడి విద్యార్థి రాజకీయాలకు కేంద్ర వేదికగా వ్యవహరిస్తుంది . విద్యార్థుల బాగోగులు , ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వ విధానాల పై ఈ మండలిలో ఎన్నికైన ప్రతినిధులు చేసే చర్చలు , సలహాలను అక్కడి ప్రభుత్వం అత్యంత కీలకంగా పరిగణిస్తుంది . యూకే లోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన దాదాపు డెబ్బై లక్షల విద్యార్థుల భవిశ్యత్తు ను ఈ మండలి ప్రభావితం చేస్తుంది…

వరంగల్ కు చెందిన అఖిల్:

వరంగల్ కు చెందిన అఖిల్ గతంలో పూణే లోని సింబయోసిస్ లా స్కూల్ నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొంది ఇటీవలే మన రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా నమోదయ్యారు . ఆ పై అంతర్జాతీయ మానవహక్కుల న్యాయ శాస్త్రం లో ఎల్ . ఎల్ . ఎం . చేయడానికి ఎడింబర్గ్ విశ్వవిద్యాలయానికి ఎంపికయ్యారు . 1583లో నెలకొల్పబడి , ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటి అయిన ఎడింబర్గ్ విశ్వవిద్యాలయం నుండి ప్రపంచ ఖ్యాతిగాంచిన మేధావులు , రాజకీయ నాయకులు అయిన చార్లెస్ డార్విన్ , అలెగ్జాండర్ గ్రహం టెల్ , జేమ్స్ మాక్స్ వెల్ , డేవిడ్ హ్యూం , జేకే రౌలింగ్ , గోర్డాన్ బ్రౌన్ తదితరులు మరియు ఎందరో దేశ అధ్యక్షులు , ప్రధాన మంత్రులు , న్యాయమూర్తులు , నోబెల్ గ్రహీతలు విద్యనభ్యసించారు . ఇంటర్మీడియట్ వరకు అఖిల్ విద్యాభ్యాసం హన్మకొండలోనే సాగింది .

పూణే లో న్యాయశాస్త్రం చదివే రోజుల్లోనే విద్యార్థి సంఘాల్లో కీలకంగా పనిచేసిన అఖిల్ , అప్పట్లో యునెస్కో విద్యార్థి మండలికి సలహాదారుగా కూడా వ్యవహరించారు . వృత్తి శిక్షణలో భాగంగా అఖిల్ గతంలో తెలంగాణ తొలి ” శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి , అప్పటి దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీ రోహిణి మరియు తదితరుల వద్ద శిక్షణ పొందారు . అఖిల్ తండ్రి డా . అంజన్ రావు కాకతీయ విశ్వవిద్యాలయం గణిత విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తుండగా తల్లి పద్మజ జిల్లా పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు .