ఓ మహిళపై కన్నేసిన కామాంధుడు తన కోరిక తీర్చాలని ఆమె బలంవంతం చేయడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా ఆమె భర్తకు ఫోన్ చేసి నీ భార్యను పంపాలని బెదిరించడం మొదలుపెట్టారు. చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు లేవు సరికదా కేసు పెడతావా అంటూ ఆ కామాంధుడు తిరిగి బాధితురాలిపైనే దాడి చేయడం కలకలం రేపింది. వివరాలు: ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు కొంతకాలం క్రితం పెళ్లైంది. ప్రస్తుతం ఆమెకు ఐదు నెలల వయసున్న బాబు ఉన్నాడు. ఐతే ఇదే మండలంలోని తాళ్లూరు గ్రామానికి చెందిన సీహెచ్ ఏడుకొండలు అనే వ్యక్తి ఆమెకు తరచూ ఫోన్ చేసి లైంగికంగా వేధిస్తున్నాడు. అంతేకాదు ఆమె భర్తకు ఫోన్ చేసి నీ భార్యను పంపాలని లేకపోతే చంపేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు.

అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఈనెల 17న జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. అనంతరం కనిగిరి చేరుకొని నడుచుకుంటూ వెళ్తుండగా పామూరు బస్టాండ్ సమీపంలో ఆమెపై ఏడుకొండలు దాడికి పాల్పడ్డాడు. నాపైనే కేసు పెడతావా అంటూ దుర్పాషలాడుతూ విచక్షణారహితంగా కొట్టాడు. కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని భర్తను తరిమేస్తానంటూ బెదరించాడు. అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లిన బాధితురాలు ఆ కామాంధుడిపై మరోసారి కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంత జరిగినా పోలీసులు మాత్రం అతడిపై చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆరోపిస్తోంది.