రామవరప్పాడు కాలువగట్టు ప్రాంతం తోటల్లో వాన రమణ (30) తన కుటుంబంతో నివసిస్తుండేవాడు. రమణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్థానికంగా తాపీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు రమణ. ఈ క్రమంలోనే అదే ప్రాంతంలో నివాసముండే మీసాల లక్ష్మితో అతడికి పరిచయం ఏర్పడింది. లక్ష్మికి భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక వీరి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. గత ఆరు సంవత్సరాలుగా లక్ష్మి-రమణల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. పిల్లలు పెద్ద వారు అవుతుండటంతో వివాహేతర సంబంధం కుదరదని రమణను లక్ష్మి దూరం పెట్టింది.

ఈ క్రమంలో లక్ష్మి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది అని అనుమానించసాగాడు రమణ. ఈ నేపథ్యంలోనే ఒంటరిగా ఇంట్లో ఉన్న లక్ష్మి వద్దకు మధ్యాహ్నం వెళ్లాడు రమణ. అక్కడ తనను ఎందుకు దూరం పెడుతున్నావ్ అంటూ ఆమెతో ఘర్షణకు దిగాడు అతడు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన లక్ష్మి కత్తితో రమణ కడుపులో పొడిచింది. ఇది గమనించిన స్థానికులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం తెల్లవారుజామున రమణ మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.