భార్య మృతి.. ప్రియుడికి గాయాలు..

భార్య పరాయి వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి జీర్ణించుకోలేక భర్త ఇద్దరిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. మంటల్లో ఆమె కాలిబూడిదవగా ఆ వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. చేవెళ్ల సీఐ గురువయ్యగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం. చేవెళ్ల గ్రామానికి దామరగిద్ద భాగ్య(25)కు రవితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు గతంలో నగరంలోని రైతుబజార్‌లో కూరగాయలు విక్రయించేవారు. హిమాయత్‌సాగర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఉమర్‌(32)తో రవికి పరిచయం ఏర్పడింది. అతను కూడ రవి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో భాగ్య, ఉమర్‌ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. పలుసార్లు రవి వారిని మందలించాడు. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించినా భాగ్య తీరులో మార్పు రాలేదు. శనివారం రాత్రి ఉమర్‌ అతని ఇంటికి రాగా ఇద్దరూ మద్యం తాగారు.

ఆ తర్వాత పనిమీద బయటకు వెళ్లిన రవి ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటికి రాగా అతని భార్య, ఉమర్‌ పడకగదిలో ఉన్నారు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన రవి ఇంటి బయట నిలిపి ఉంచిన ఉమర్‌ ద్విచక్రవాహనం నుంచి పెట్రోలు తీసుకొని వచ్చి వారిద్దరిపై చల్లి నిప్పటించి బయట నుంచి గడియపెట్టి పారిపోయాడు. గదిలో నుంచి పొగలు వస్తున్న విషయం గుర్తించిన ఇరుగుపొరుగు తలుపు తెరిచి చూసే సరికి ఆమె అగ్నికి ఆహుతైంది. ఉమర్‌ గాయాలతో బయటకు పరుగులు తీస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించగా వారు చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొద్ది సేపటి తర్వాత పోలీసులకు లొంగిపోయిన రవి తన భార్య పరాయి వ్యక్తితో ఉండటాన్ని తట్టుకోలేక ఈ పని చేశానని ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తల్లి మరణించడం. తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారి పిల్లలు అనాథలుగా మిగిలారు.