పెళ్లి వయస్సుకు వచ్చిన పిల్లలున్నారు అయినా ఆ భార్య, భర్తలిద్దరు పక్కచూపులు చూశారు. మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం, తానేమి తక్కువ తిన్నానా అన్నట్లు కొడుకు వయసున్న యువకుడితో భార్య చెట్టాపట్టాలేసుకుని తిరగడం,
ఒకే ఇంట్లో భార్య, భర్తలతో కలిసి ప్రియుడు సహజీవనం చేయడం ఇలా అక్రమ సంబంధం, సజీవదహనం కేసులో సభ్య సమాజం తలదించుకునే విషయాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. కేసు వివరాలు: శనివారం అప్పుడప్పుడే తెల్లారుతోంది మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్‌లో ఇల్లు తగలబడుతోంది కట్‌ చేస్తే ఆరుగురు సజీవదహనమయ్యారు. ఈ కేసులో పోలీసు డైరీలో పేజీలు పెరుగుతున్నా కొద్దీ సంచనాలు వెలుగుచూస్తున్నాయి. ఎవరో నిప్పుపెట్టారని తెలుసు కాని దీని వెనుక ఇంత కథ ఉందా అన్నది ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. శనిగారపు శాంతయ్యను హతం చేసేందుకు భార్య సృజన 3 నెలల క్రితమే సుపారీ హత్యకు పథకరచన చేసినట్టు తేలింది.

రెండు సందర్భాల్లో మర్డర్ ప్లాన్ వికటించగా మూడోసారి పక్కాప్లాన్ అమలుచేసింది. భర్త శాంతయ్యతో పాటు సహజీవనం చేస్తున్న ప్రియురాలు మాస పద్మను అడ్డు తొలగించేందుకు సృజన 15 లక్షల రూపాయల డీల్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. సింగరేణి కార్మికునిగా పనిచేస్తున్న శాంతయ్యకు ఏడేళ్ల క్రితం పరిచయమైన పద్మతో స్నేహం కాస్త హద్దులు దాటి సహజీవనం వరకు వెళ్లింది. భార్య మరో యువకుడికి దగ్గరైంది. ఈ డబుల్ యాంగిల్ వివాహేతర సంబంధాల్లో ఆస్తుల గొడవలు, భూముల లావాదేవీలు వచ్చిచేరాయి. ఈ క్రమంలో భర్త ఆస్తి తనకు దక్కదని భావించిన భార్య ఆ ఇద్దరిని మట్టుపెడితే ఆస్తి అంతా తనకే దక్కుతుందని ప్లాన్ వేసిందిసృజన. ఇందుకు కుమారులిద్దరు మద్దతు తెలిపారు. సృజనకు శారీరకంగా దగ్గరైన లక్షేట్టిపేట యువకుడు శాంతయ్యపై పలుమార్లు హత్యయత్నానికి ప్రయత్నించాడు. 3 నెలల క్రితం శాంతయ్య కిడ్నాప్‌నకు ప్రయత్నించడం చాకచక్యంగా తప్పించుకున్న శాంతయ్య శ్రీరాంపూర్ పోలీసులను ఆశ్రయించాడు.

ఆ సమయంలో పోలీసులు కిడ్నాప్ కేసును లైట్ తీసుకుని భార్య, భర్తలిద్దరిని కలిపేందుకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో అది కాస్తా బెడిసికొట్టి ఇలా సజీవదహనం వరకు వెళ్లిందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సజీవదహనం చేసేందుకు పక్కా ప్లాన్ రెడీ చేసుకున్న సృజన ఘటన జరిగిన ఇంటి దగ్గర మూడు రోజులు నలుగురు వ్యక్తులతో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. భర్త శాంతయ్యతో కలిసి ఉంటున్న ప్రియురాలు మాస పద్మ, పద్మ భర్త శివయ్యను హత్య చేయాలని డిసైడ్ అయిన సృజన ప్రియుడి స్నేహితులకు 15లక్షల సుపారీ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఆ డబ్బులను భూమి రూపంలో ఇస్తానని మాటిచ్చిన సృజన అందుకు తగ్గట్టుగానే ల్యాండ్ పేపర్లను సైతం ప్రియుడికి అప్పగించినట్లు తెలుస్తోంది.

ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 16టీంలతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన మూడు గంటల్లోనే నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకోగా తాజాగా పెట్రోల్ కొనుగోలు చేసిన బంక్ ను గుర్తించి సీసీ పుటేజ్ ఆధారంగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సృజన ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండగా మృతుడు శాంతయ్య కుమారులు పరారీలో ఉన్నారు. శాంతయ్య డెడ్‌బాడీని ఎవ్వరు తీసుకెళ్లేందుకు ముందుకు రాకపోవడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో అనాథ శవంగా పడి ఉంది. ఇవాళ మున్సిపాలిటీ అధికారులే అంత్యక్రియలు చేసే అవకాశం ఉంది.