మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కోడలు నిద్రపోతోందని అత్తమామలు ఆమెపై దాడి చేసిన ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. అహమ్మాదాబాద్ షాహిబాగ్ కు చెందిన 24 ఏళ్ల మహిళ భర్త అత్తమామలతో నివసిస్తోంది. వారికి 2016లో వివాహం అయ్యింది. ఆమహిళ ఉదయాన్నే నిద్రలేచి ఇంటి పనులు అన్నీ చేసుకోవటం వల్ల మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం కాసేపు నిద్రపోతోంది. ఇది అత్తమామలకు నచ్చలేదు. దీంతో వారు కోడలిపై, కొడుక్కి చాడీలు చెప్పారు. వారు ముగ్గురు కలిసి ఆమెను కొట్టారు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత కొందరు పెద్దమనుషులు చేసిన పంచాయతీతో వారు కొట్టము అని చెప్పటంతో ఆమె తిరిగి అత్తింటికి వచ్చింది. అయినా వాళ్ల ప్రవర్తనలో ఏమీ మార్పురాలేదు.

ఉదయం అంతా పని చేసి అలసి పోవటంతో కోడలు మధ్యాహ్నం పూట పడుకోవటం కూడా మానలేదు. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కూడా అత్తమామలు, భర్త పనిలో సహాయం చేయలేదు. 2017 సెప్టెంబర్ 18 వ తేదీన ఆడపిల్లకు జన్మనిచ్చింది. మగబిడ్డ పుట్టలేదని మళ్లీ అత్తమామలు, భర్త వేధించటం మొదలు పెట్టారు. 2021 ఫిబ్రవరి 7న భర్త ఆమెను పుట్టింట్లో దింపి వెళ్ళిపోయాడు. గత 10 నెలలలుగా పుట్టింట్లో ఉన్న మహిళ మాధవపుర పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. భర్త,అత్తమామలు పెట్టిన హింసను తన ఫిర్యాదులో సోదాహరణంగా వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.