మంచిర్యాల‌: తొలి సంతానం ఆడపిల్ల మళ్లీ ఆడపిల్ల పుడితే అత్తింటివారు ఏమనుకుంటారోనని ఆందోళన చెందిన ఓ గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. తీరా పోస్టుమార్టం నివేదికలో ఆమె గర్భంలో ఉన్నది మగశిశువని వైద్యులు తేల్చడంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతమైంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన ఘటన వివరాలు: మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన ఎగ్గెనా ఆనంద్‌తో దండెపల్లి మండలం నర్సపూర్‌కు చెందిన రమ్య (25)కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కూతురు ఆరాధ్య ఉంది. తొమ్మిది నెలల క్రితం రమ్య మళ్లీ గర్భం దాల్చడంతో భర్త స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. 15 రోజుల క్రితం బోనాల పండుగకోసం రమ్య భర్తతో కలసి పుట్టింటికి వెళ్లింది. ప్రసవం అయ్యేంతవరకూ పుట్టింట్లోనే ఉంటానని భర్తతో చెప్పి తల్లి శారద వద్దే ఉండిపోయింది.

ఈ నెల 3న వైద్య పరీక్షల కోసం రమ్య తల్లితో కలసి మంచిర్యాలకు వచ్చింది. విషయం తెలుసుకున్న ఆనంద్‌ ఆస్పత్రికి చేరుకుని రమ్యను ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా నిరాకరించడంతో వెళ్లిపోయారు. డాక్టర్‌ ఈ నెల 6వ తేదీకి డెలివరీ డేట్‌ ఇవ్వడంతో కూతురును అల్లుడి ఇంటికి తీసుకుని వెళ్లి రమ్యను అక్కడే ఉండాలని సూచించింది. గురువారం కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్లాల్సిన రమ్య తనకు ఆడపిల్ల పుడితే అత్తింటివారు ఏమంటారోనని ఆందోళన చెంది బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చున్నీతో ఫ్యాన్‌కు ఉరిపోసుకుంది. రమ్య అంత్యక్రియలకు ముందు మృతదేహానికి వైద్యులు చేసిన పంచనామాలో ఆమె గర్భంలో ఉన్నది మగపిల్లాడని తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే రమ్య అత్తింటి వారిపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.