సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర గ్రామాల ప్రజలు కొంతకాలంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ గ్రామాలను తెలంగాణలో విలీనం డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో కలిస్తే తమకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు మహారాష్ట్ర రైతులు ఉద్యమబాట పట్టారు. నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలు పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు పోరాటానికి సిద్ధమయ్యారు. ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రైతులు మంగళవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని బాబ్లీ సర్పంచ్ బాబురావు గణపతిరావు కదమ్ నాయకత్వంలో కేసీఆర్‌కు విన్నవించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సీఎంని కలిసిన వారిలో నాందేడ్ జిల్లాలోని నయ్ గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్ గావ్నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు ఉన్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించారు. గతంలో నాందేడ్‌ జిల్లాలోని 6 నియోజకవర్గాలను తెలంగాణలో కలపాలని నేతలు ఉద్యమించారు.