సెయింట్‌ ఫ్రాన్సిస్‌ వుమెన్స్‌ కాలేజీ విద్యార్థినుల వస్త్రాధారణపై నిబంధన విధించడంతో వివాదం మొదలైంది. మోకాళ్ల కింది వరకు ఉన్న కుర్తీ ధరించి వస్తేనే కాలేజీలోకి అనుమతిస్తామని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది. నిబంధన పాటించని విద్యార్థినులను ప్రిన్సిపల్‌ వెనక్కి పంపిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. అయితే, ఈ నిర్ణయంపై విద్యార్థినులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సాధికారత కోసం పాటుపడుతామని గొప్పలు చెప్పుకునే ఇదే కాలేజీలో ఇలాంటి నియమాలు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా శనివారం ఆందోళన చేపట్టారు..

సోమవారం కూడా ఆందోళన తీవ్రతరం చేస్తామని వెల్లడించారు. ఇక సెయింట్‌ ఫ్రాన్సిస్‌ పూర్వ విద్యార్థి ఒకరు కాలేజీ యాజమాన్యం తీరుపై ఫేస్‌బుక్‌ పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం మధ్యలో అనవసర నిబంధనలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. పొడవాటి కుర్తీ వేసుకుని కాలేజ్‌కి వస్తేనే మంచి పెళ్లి సంబంధాలు వస్తాయని గతంలో యాజమాన్యం చెప్పిందని ఆరోపించారు. మహిళా సెక్యురిటీ సిబ్బందిని నియమించుకుని మరీ కుర్తీలు మోకాళ్ల కింది వరకు ఉన్నాయా అని తనిఖీ చేయిస్తున్నారని వాపోయారు. డ్రెస్‌ నిబంధనలు పాటించడం లేదని తరగతులకు అనుమతించకపోవడం దారుణమన్నారు.