టీఆర్​ఎస్​ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నల్లా ద్వారా స్వచ్ఛమైన నీరు అందించాలనే లక్ష్యంతో ప్రతిష్ఠాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని నాయకపల్లి, బాల్యనాయక్ తండాలో మాత్రం మిషన్​భగీరథ నీటితో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గూడూరు మండలంలోని 39 గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు నల్లాల ద్వారా అందిస్తున్నారు.

చాలా గ్రామాల్లో నీటి సరఫరాకు ప్రత్యేకంగా పైపులైన్ వేశారు. కొన్ని గ్రామాల్లో మాత్రం పాత పైపులైన్ల ద్వారానే భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. నాయకపల్లి గ్రామంలో ఆరు నెలలుగా నల్లా పైపుల ద్వారా నీరందుతోంది. మిషన్ భగీరథ నీటి సరఫరా ప్రారంభమైనప్పటి నుంచి గ్రామస్తులకు కొద్దికొద్దిగా దురదలు మొదలయ్యాయి.

వాతావరణంలో మార్పులు, ఇంకేదైన కారణాలు కావచ్చని మొదట్లో లైట్ గా తీసుకున్నారు. రోజులు గడుస్తున్న కొద్ది నాయకపల్లి, బాల్యనాయక్ తండాతో పాటు సమీప గ్రామాల ప్రజల్లో చాలామందికి దురదలు మొదలయ్యాయి. గ్రామంలో సగానికి పైగా ప్రజలకు దురదతో ఒళ్లంతా దద్దుర్లు వచ్చి నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. మూడు నెలలుగా దవాఖానల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. దురదలతో రాత్రిపూట కనీసం నిద్రపోలేకపోతున్నామని వాపోతున్నారు. గ్రామంలోని చంద్రమ్మ అనే వృద్ధురాలికి మత్తు టాబ్లెట్ లు ఇచ్చి పడుకోబెడుతున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒకదశలో వాటర్ సప్లై చేసేవారికి భగీరథ వాటర్ బంద్ చేయాలని చెప్పినా వినలేదని నాయకపల్లి, బాల్యనాయక్ తండా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.