చిన్నిచిన్ని కార‌ణాలు, పిచ్చి పిచ్చి ఆలోచ‌న‌ల‌తో వివాహ వ్య‌వ‌స్థ‌ను అప‌హాస్యం చేస్తూ విడాకుల కోసం కోర్టుకు వెళుతున్న జంట‌లు అనేకం క‌నిపిస్తున్నాయి. ఇలాంటి కేసుల‌ను చూసిన ఓ న్యాయ‌మూర్తి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డంతో పాటు ఎలాంటి కేసుల్లో విడాకుల‌కు వ‌చ్చారో ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా వివ‌రించారు. వంట చేయ‌కుండా కేవ‌లం మ్యాగీ నూడిల్స్ మాత్ర‌మే త‌న భార్య చేసి పెడుతోందంటూ ఓ భర్త విడాకుల కోసం వ‌చ్చాడ‌ర‌ని బ‌ళ్ళారి జిల్లా న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎం.ర‌ఘునాధ్ తెలిపారు. ప్ర‌తి రోజూ మూడు పూట‌లా మ్యాగీ నూడిల్స్ చేసి పెడుతోంద‌ని వాపోయాడు. ఇలాంటి భార్య త‌న‌కొద్దంటూ విడాకులు కోరాడ‌ని, అందుకు ఆ భార్య కూడా స‌మ్మ‌తించి విడాకులు కోరింద‌ని పేర్కొన్నారు.

మ‌రో కేసులో భోజ‌నం చేస్తోన్న స‌మ‌యంలో కంచానికి ఎడమ వైపు ఉప్ప డ‌బ్బా పెట్టాల‌న్న భ‌ర్త మాట‌ని పెడ‌చెవిన పెట్టి, కుడి వైపున ఉప్పు డబ్బా పెట్టింద‌ని ఆరోపిస్తూ విడాకుల కోసం కోర్టుకు వ‌చ్చార‌ని చెప్పారు. కుడి వైపున ఉప్పు డ‌బ్బా పెడిత తినే చేతితో ఉప్పును ఎలా తీసుకోవాలంటూ భ‌ర్త వాదన అయితే. కుడి వైపున పెట్ట‌డం సెంటిమెంట్ అంటూ భార్యది మ‌రో వాద‌న‌. ఇలాంటి భార్యాభ‌ర్త‌లు కూడా విడాకుల కోసం కోర్టుకు వ‌చ్చారంటూ తెలిపారు. మ‌రో కేసుని ఉద‌హ‌రిస్తూ వెడ్డింగ్ సూట్ క‌ల‌ర్ బాగా లేద‌ని భార్య కోర్టు మెట్టెక్కింద‌ని న్యాయ‌మూర్తి పేర్కొన్నారు. భ‌ర్త వేసుకున్న వెడ్డింగ్ సూట్ క‌ల‌ర్ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని, మార్చుకోవాల‌ని చెప్పినా భ‌ర్త స‌సేమిరా అంటున్నాడంటూ ఓ విడాకుల కేసు వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. ఇలాంటి విడాకుల కేసుల‌ను త‌న కెరియ‌ర్‌లో చూడాల్సి వ‌చ్చింద‌ని వివ‌రించారు.