సాంకేతికత వల్ల మనిషికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అది ఉపయోగించుకునే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల అమెరికాలో ఓ పశువైద్యుడు యాపిల్‌ స్మార్ట్‌వాచ్‌ సాయంతో ప్రాణాపాయం నుంచి బయటపడటం విశేషం. ఓ మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం:

యూఎస్‌లోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసించే డా.రే ఎమర్సన్‌ యాపిల్‌ స్మార్ట్‌వాచ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇటీవల ఆయనకు గుండె కొట్టుకోవడంలో తేడాలు వచ్చి సమస్య ఏర్పడింది. మొదట ఆయన సమస్యను గుర్తించలేకపోయారు. కొద్ది సేపటికి ఎమర్సన్‌ చేతికి పెట్టుకున్న యాపిల్‌ స్మార్ట్‌వాచ్‌ అతడి హృదయ స్పందనలు సరిగా లేవని నోటిఫికేషన్స్‌ అందించింది.

ఆ నోటిఫికేషన్‌ అందిన వెంటనే అతడు అప్రమత్తమై సమీపంలోని సెయిండ్‌ డేవిడ్‌ వైద్య కేంద్రానికి వెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షలు చేసిన అనంతరం శస్త్రచికిత్స చేసేందుకు దారి తీసింది. దీంతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత కోలుకున్న తర్వాత అతడు మీడియాతో మాట్లాడుతూ తాను ఆ వాచ్‌ను చాలా చౌక ధరకు కొన్నానని కానీ ఇప్పుడు అది తన దృష్టిలో వెలకట్టలేనిదని అభిప్రాయపడ్డారు. ఈ వాచ్‌ల సాయంతో ఇప్పటికే యూఎస్‌లో చాలా మంది హృదయ సంబంధ సమస్యలు తెలుసుకుని అప్రమత్తమవుతున్నారని ఆ మీడియా సంస్థ వెల్లడించింది.