వరంగల్‌ మహా నగరపాలక సంస్థ కమిషనర్‌గా పమేలా సత్పతి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ భూసేకరణ, భూనిర్వాసితుల శాఖ సంచాలకురాలిగా పనిచేస్తున్నారు. 2015 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన పమేలా తొలి పోస్టింగ్‌ భద్రాచలం సబ్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు. 19 నెలల పాటు పనిచేశారు. మూడు నెలల పాటు భద్రాచలం దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా కొనసాగారు.

ఏడాది నుంచి భూసేకరణ శాఖలో పని చేస్తున్నారు. 11 నెలల తర్వాత గ్రేటర్‌లో మళ్లీ ఐఏఎస్‌ అధికారి పాలన మొదలు కానుంది. 2019 జనవరి నుంచి రవికిరణ్‌(నాన్‌ ఐఏఎస్‌) పని చేశారు. రాజకీయ ఒత్తిళ్లతో రెండు నెలలుగా సెలవుపై వెళ్లారు. ఈ క్రమంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పూర్తిస్థాయి కమిషనర్‌ ల్లేకపోవడంతో బల్దియా పాలన స్తంభింస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో పమేల సత్పతిని ఇక్కడికి పంపుతోంది. ఒకటి, రెండు రోజుల్లో విధుల్లో చేరే అవకాశాలున్నాయని తెలిసింది.

ఆరో మహిళా కమిషనర్‌గా

1995లో తొలి మహిళా ఐఏఎస్‌ కమిషనర్‌గా శాలినీమిశ్రా రెండేళ్లు, 2005 నుంచి నీతూప్రసాద్‌ ఏడాదిన్నర, తర్వాత స్మీతాసభర్వాల్‌ పదినెలలు, అనంతరం వాకాటి కరుణ ఆరు నెలలు, శ్రుతి ఓజా 15 నెలల పాటు కొనసాగారు. అందరూ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు గ్రేటర్‌లో ఆరో మహిళా ఐఏఎస్‌ కమిషనర్‌గా పమేల సత్పతి బాధ్యతలు చేపట్టనున్నారు.