వరంగల్‌ శివనగర్‌లో ఘటన కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకుని కడతేర్చాడు

శివనగర్‌కు చెందిన మైస నరేష్‌ (23) తో భూపే‌ష్‌నగర్‌కు చెందిన జయమ్మ-కొమురయ్య దంపతుల కుమార్తె రమ్య(20)ను ఇచ్చి 2016 సంవత్సరంలో వివాహం జరిపించారు. నరేష్‌ శివనగర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో పాత ఇనుప సామగ్రి కొనుగోలు చేసి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. కాగా ఇటీవల రమ్యపై అనుమనం పెంచుకున్న సురేష్‌ ఆమెతో కొంతకాలంగా గొడవ పడుతున్నాడు. అతడి వేధింపులు భరించలేక రమ్య తన పిల్లలను తీసుకొని ఇటీవల తన సమీప బంధువుల ఇంట్లో తలదాచుకుంది.

ఈ క్రమంలో నరేష్‌ భూపే‌ష్‌నగర్‌లో ఉన్న రమ్య పెద్దమ్మ ఇంటికి వెళ్లి ఆరా తీశాడు. వారిని బెదిరించడంతో రమ్య ఉన్న ఊరి వివరాలు తెలిపారు. దీంతో వెంటనే నరేష్‌ తన మిత్రుడితో కలిసి ఆ ఊరికి వెళ్లి రమ్యను బలవంతంగా శివనగర్‌కు తీసుకొచ్చాడు. క్షణికావేశంలో రమ్య మెడపట్టుకొని విరిచి ఆపై ఛాతి పై పిడిగుద్దులు గుద్దడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు అక్కడికి చేరుకోగా నరేష్‌ వారిని కత్తితో బెదిరించి పారిపోయాడు.

స్థానికుల సమాచారంతో మిల్స్‌కాలనీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. రమ్య మృతదేహాన్ని MGM మార్చురీకి తరలించారు.

అనుమానంతో కాగా రమ్య మృతితో ఆమె ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మిగిలారు. రమ్య తల్లి జయమ్మ రోదనలు స్థానికులకు కన్నీరు తెప్పించింది. మిల్స్‌కాలనీ సీఐ దయాకర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.