ఆర్టీసీ ప్రత్యామ్నాయ సేవలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో సాఫీగా కొనసాగుతున్నాయి. గత నెల 5వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో ప్రయాణికులకు రవాణా సేవలు అందించడానికి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. సమ్మె సందర్భంగా వరంగల్ రీజియన్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.

రీజియన్‌లోని మొత్తం 9 డిపోల నుంచి సమ్మె ప్రారంభం నుంచి ఆపరేషన్స్ చేస్తున్నారు. సమ్మెకు ముందు కొనసాగిన విధంగానే ఇప్పటి వరకు ఆర్టీసీ సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ప్రతి రూట్‌లో సర్వీస్‌లు నడిపించడానికి రూట్‌వారిగా డిపో స్థాయి అధికారులు, ఆర్టీఏ, పోలీసుశాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు.

పల్లెలు, పట్టణాలనుంచి ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ రీజియన్ లోని తొమ్మిది (వరంగల్ 1, 2, హన్మకొండ, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, జనగామ) డిపోల నుంచి బస్సుల రాకపోకలు ప్రశాంతగా కొనసాగుతున్నాయి.