పాలకుర్తి (జనగాం): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. ఈఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు శుక్రవారం వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం: దేవరుప్పుల మండలం సీతరాంపురం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ సురేశ్‌కు సరితతో 12 ఏళ్లక్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. సురేశ్‌ ఆర్‌ఎంపీగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా ఇంటి పక్కనే ఉంటున్న యువకుడు అభిలాష్‌తో సరిత సన్నిహితంగా ఉంటోంది. వీరి పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది.

వివాహేతర బంధాన్ని గుర్తించిన సురేశ్‌ తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈక్రమంలో భర్త అడ్డు తొలగించాలని ప్రియుడు అభిలాష్‌తో ఆమె చెప్పింది. రాత్రి సమయంలో ఇద్దరూ కలిసి సురేశ్‌ను హత్య చేశారు. అనంతరం నీళ్ల ట్యాంకులో పడేశారు. ఇదంతా కూతుళ్లు ప్రత్యక్షంగా చూశారు. కాగా మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. సురేశ్‌ హత్య కేసును సత్వరమే ఛేదించిన సీఐ వి.చేరాలు, ఎస్‌ఐ రమేశ్‌ను అభినందించి వారికి అవార్డు కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. సమావేశంలో సీఐ వి.చేరాలు, దేరుప్పుల ఎస్‌ఐ రమేశ్, పాలకుర్తి ఎస్‌ఐ శ్రీకాంత్‌ ఉన్నారు.