కన్న కొడుకును కండ్లారా చూడకముందే ఓ తల్లి ఈ లోకాన్ని విడిచిపోయింది . డెలివరీ అయిన తర్వాత తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకున్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది . బాబు జన్మించిన పది రోజుల్లోనే తల్లి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ హృదయవిదారక సంఘటన మండలంలోని గిద్దెముత్తారం తండాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది .

గ్రామస్తులు తెలిపిన వివరాలు: తండాకు చెందిన గుగులోతు వెన్నెల ( 22 ) ను గోదావరిఖని లో ఉంటున్న వరుసకు మేనమామ బానోతు సారయ్యకు ఇచ్చి ఏడాదిన్నర క్రితం పెండ్లి జరిగింది. వెన్నెల గర్భిణి కావడంతో డెలివరీ కోసం నెలరోజుల క్రితం గిద్దెముత్తారం తండాలోని పుట్టింటికి వచ్చింది . 10 రోజుల కిందట ఆమెను నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు హన్మకొండలోనిఓ ప్రైవేటు హాస్పిటల్ లో చేర్పించారు . కాగా డాక్టర్లు నార్మల్ డెలివరీ చేశారు . కానీ అప్పటికే జ్వరంతో ఉన్న వెన్నెలకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది, ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ హాస్పి టల్‌కు తరలించారు .

అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో వెంటనే హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. రూ.10లక్షలకు పైగా ఖర్చు చేసినా ఎన్ని హాస్పిటళ్లు తిరిగినా వెన్నెల మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కనీసం పుట్టిన బాబును చూసుకునే అదృష్టం లేకుండా పోయిందని బంధువుల రోధనలు స్థానికులను కలచివేసింది. విషయం తెలుసుకున్న జడ్పీటీసీ గొర్రె సాగర్, వైఎస్ఎంపీపీ నిమ్మగడ్డ రాంబాబు , సర్పంచ్ పోలవేన పోశాలు , ఎంపీటీసీ పప్పుల విజయలక్ష్మి సంజీవయ్య, నాయకులు పులి అంజిరెడ్డి , హరిభూషణ్ , బాలునాయక్ తదితరులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం ప్రకటించారు .