సద్దుల బతుకమ్మ, దసరా పండుగలు సెలవులు కావడంతో ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లడానికి ప్రణాళికలు వేసుకున్నారు. కానీ శనివారం నుంచి ఆర్టీసీ సమ్మె కారణంగా ఎక్కడి బస్సులు అక్కడే డిపోలకు పరిమితం కానున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సాధారణ రోజుల్లోనే నిత్యం 30 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తుండగా, పండగ సమయంలో వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది.

అయితే సమ్మె కారణంతో ప్రయాణికులకు పాట్లు తప్పేలా లేవు. మొత్తం రీజియన్‌ పరిధిలో అన్ని తొమ్మిది డిపోల్లో కలిపి 1,734 మంది కండక్టర్లు, 1,564 మంది డ్రైవర్లు, 182 మంది మెకానిక్‌లు, 620 మంది ఇతర ఉద్యోగులు మొత్తం 4,100 మంది సమ్మెకు వెళుతున్నారు. ఇందులో 15 మంది ఉన్నతాధికారులు మాత్రమే విధులు నిర్వర్తించనున్నారు. అయితే సమ్మె కొనసాగితే ప్రత్యామ్నాయంగా 230 అద్దె బస్సులతో సర్వీసులను కొనసాగిస్తామని వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌ అంచూరి శ్రీధర్‌ తెలిపారు.

అందుబాటులో ఉన్న బస్సులను కేవలం ప్రధాన మార్గాల్లో మాత్రమే తాత్కాలికంగా నియమించే సిబ్బందితో సర్వీసులను నడిపేందుకు ఏర్పాటు చేస్తున్నారు. హన్మకొండ నుంచి హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, ఏటూరునాగారం, నర్సంపేట ప్రాంతాలకు ఈ బస్సులను తిప్పేందుకు తగిన ప్రణాళికతో సిద్ధమయ్యారు. అర్హతగల వారిని కండక్టర్లు, డ్రైవర్లుగా నియమించుకుని, రోజువారీగా భత్యం చెల్లించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను కూడా సేవలందించాలని, తగిన విధంగా భత్యం ఇస్తామని వెల్లడించారు.