తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తుంది, ప్రతిపక్ష పార్టీల నాయకులు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అధికార పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మళ్లీ టికెట్ కోసం ఇప్పటి నుంచే పడరాని పాట్లు పడుతున్నారు. నియోజకవర్గ ప్రజల నాడిని పట్టుకుని, వారి మద్దతుతో మళ్లీ అవకాశాన్ని చేజిక్కించుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇక సహజంగానే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నియోజకవర్గ ప్రజలతో రకరకాల కార్యక్రమాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ప్రజల నాడి పట్టి సైలెంట్‌గా వరుస విజయాలతో తనదైన శైలిలో పని చేసుకుంటు ముందుకు వెళ్తున్న దాస్యం వినయ్ భాస్కర్.

2009 నుండి వరుసగా నాలుగు సార్లు వినయ్ భాస్కర్ భారీ మెజారిటీతో గెలిచారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన 2009 నుండి 2014 వరకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఏకైక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. ఈ 5ఏళ్లు తెలంగాణ ఉద్యమాన్ని వినయ్ భాస్కర్ ముందుండి నడిపారు. వినయ్ భాస్కర్ సోదరుడు ప్రణయ్ భాస్కర్ ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ నినాదాన్ని మొదటిసారి వినిపించింది ప్రణయ్ భాస్కర్. అప్పటి నుండి వీరి కుటుంబానికి హన్మకొండ ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంది.

సొంత కార్యక్రమాలతో నిత్యం ప్రజాక్షేత్రంలో వినయ్ భాస్కర్:

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే కాకుండా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమాలకు వినయ్ భాస్కర్ శ్రీకారం చుట్టారు. మళ్లీ వచ్చే ఎన్నికలలో ప్రజల పక్షాన నిలవాలని ఆయన రకరకాల కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. అపార్ట్మెంట్ దర్శన్, అడ్డా ములాఖత్, కాలనీ దర్శన్, ప్రజలతో ముఖాముఖి, వాక్ అండ్ టాక్ విత్ ఎమ్మెల్యే, కార్మిక మాసోత్సవం లాంటి కార్యక్రమాలను వినయ్ భాస్కర్ స్వయంగా నిర్వహిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాది ముబారక్ చెక్కులను లభ్దిదారుల ఇంటికి వెళ్లి నేరుగా వినయ్ భాస్కర్ ఇస్తుంటారు. రాజకీయాలకు అతీతంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చర్యలు చేపడుతున్నారు. ఇలా వినూత్న కార్యక్రమాలతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ దాస్యం వినయ్ భాస్కర్ మిగితా ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తు రాజకీయంగా వరంగల్ వెస్ట్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ పార్టీలను వీక్‌ చేయడంలో వినయ్ భాస్కర్ సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు.

కేసిఆర్ నిర్వహించిన సర్వే నివేదికలోనూ వినయ్ భాస్కర్ కు మంచి మార్కులు:

తాజాగా టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సర్వేలోనూ వినయ్ భాస్కర్ కు మంచి మార్కులే పడ్డాయి అని తెలుస్తుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మళ్లీ వినయ్ భాస్కర్ కు టికెట్ ఇస్తారు అన్న అభిప్రాయం సర్వే సంస్థలే వెల్లడించినట్టు తెలుస్తుంది. దాస్యం వినయ్ భాస్కర్ ను ఇప్పటికే నాలుగు సార్లు ఎన్నుకున్న ప్రజలు, మరోమారు ఆదరించటం కోసం వినయ్ భాస్కర్ ఇప్పటి నుంచి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ, ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

రాజకీయ నేపద్యం:

దాస్యం వినయ్ భాస్కర్ 1999, 2004 ఎన్నికల్లో హనుమకొండ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఇక తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. 2009లో టీఆర్ఎస్ నుంచి వరంగల్ వెస్ట్‌లో పోటీ చేసి గెలిచారు. ఆ వెంటనే తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2010 ఉపఎన్నికలో పోటీ చేసి మళ్ళీ గెలిచారు. ఇక తెలంగాణ వచ్చాక 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. సీనియర్ ఎమ్మెల్యేగా వరంగల్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో బాగా అభివృద్ధి జరిగే నగరాల జాబితాలో వరంగల్ ముందుంది. కేటీఆర్ సహకారంతో వరంగల్‌లో ఐటీ హబ్‌ని కూడా తీసుకొచ్చారు. రోడ్లు, తాగునీరు సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు.

ఇప్పటికీ వరించని మంత్రి పదవి:

వినయ్ భాస్కర్ గురించి తెలిసిన వాళ్లు చాలామంది చెప్పేది ఒక్కటే. ఆయన ఎప్పుడో మంత్రి కావాల్సింది. కానీ ఎక్కడ ఒకమూల అదృష్టం ఆయన వెన్నంటి ఉండడం లేదట. అందుకే ప్రతీ సారి మినిస్ట్రీ రేసులో ముందుకొచ్చి వెనక్కి వెళ్లిపోతున్నారు వినయ్ భాస్కర్. సీఎం కేసీఆర్ రెండోసారి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత వినయ్ భాస్కర్ మంత్రి కావడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ మరోసారి ఆయనకు లక్ కలిసి రాలేదు. చివరకు వినయ్ భాస్కర్ కు ప్రభుత్వ చీఫ్ విప్ గా బాధ్యతలు కట్టబెట్టి తగిన గౌరవం కల్పించారు సీఎం కేసీఆర్. ఈసారి తోలి విడతలోనే వినయ్‌కు మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి.