ములుగు జిల్లాలోని ఏదేని ప్రభ్వుత్వ కార్యాలయానికి ఉదయం 9 గంటలకే వెళ్లారనుకోండి అక్కడ ఉన్న ఉద్యోగులంతా సెల్ఫీలు దిగుతూ కనిపిస్తారు. తమ సీట్లలో కూర్చున్నాక ఫోన్ పట్టి ఫోటో దిగుతూ కనిపిస్తారు అదేంటి? అదేమైనా ఫోటో షూట్ అనుకోకండి. అది ఉద్యోగుల అటెండెన్స్. సెల్ఫీలు దిగితే అటెండెన్స్ అంటారేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ ములుగు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఈ సెల్ఫీ అటెండెన్స్‌ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించే విధంగా ఆయనే స్వయంగా ఈ యాప్‌ను తయారు చేయించారు. ఆ యాప్ పేరు ‘ములుగు వెలుగు అటెండెన్స్’. వైద్య ఆరోగ్య శాఖ, స్కూల్, పంచాయత్ రాజ్ శాఖ, ఆర్‌అండ్‌బీ, ఆస్పత్రి ఇలా శాఖ ఏదైనా సరే కచ్చితంగా ఉద్యోగులంతా ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందే. ఆఫీసుకు వెళ్లి తమ సీట్లలో కూర్చొని సెల్ఫీ దిగి యాప్ ద్వారా కలెక్టర్‌కు పంపాలి.

అది కూడా రోజూ ఉదయం 9 గంటల లోపే. ఒక వేళ ఉద్యోగి ఎవరైనా వర్క్ ఎట్ సైట్ చేసినా యాప్‌లో వివరాలు పొందుపరచాలి. ప్రభుత్వ ఉపాధ్యాయుల దగ్గరి నుంచి, కలెక్టర్ కింది స్థాయి ఉద్యోగి వరకు అందరూ ఈ యాప్‌లో సెల్ఫీ దిగి అటెండెన్స్‌ చెప్పాల్సిందే. అంతేకాదు ఏ సమయానికి ఆఫీసుకు వస్తున్నారు? ఏ సమయానికి వెళ్తున్నారు? తదితర వివరాలు కూడా యాప్‌లో పొందుపరచాల్సిందే. ఈ విధానంపై కొందరు ఉద్యోగులు పెదవి విరుస్తున్నా ప్రజలు మాత్రం కలెక్టర్ చర్యను మెచ్చుకుంటున్నారు. అధికారులు సమయానికి ఆఫీసుకు వస్తున్నారని చెబుతున్నారు.