శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రూపిరెడ్డి రాజిరెడ్డి అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు బుధవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: తాను 2004 నుండి గండ్ర దంపతులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో ముఖ్య కార్యకర్తగా పనిచేస్తూ పార్టీకి ఎనలేని సేవలు అందించి రెండు సార్లు పత్తిపాక గ్రామ శాఖ అధ్యక్షుడిగా పని చేశానన్నారు. గ్రామంలో ప్రతీ కార్యకర్తను కలుపుకొనిపోతూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అనేక మంది నాయకుల గెలుపులో ముఖ్య పాత్ర వహిస్తూ నిస్వార్థంగా సేవలు అందించానన్నారు. తదనంతరం జరిగిన పరిణామాల కారణంగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డితో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరానని తెలిపారు.

అనంతరం టీఆర్ఎస్ పార్టీలో సైతం ప్రజలందరి అభీష్టం మేరకు రెండు సార్లు ఏకగ్రీవంగా గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎన్నికయ్యానన్నారు. ఇటీవల కొంతమంది నేతలు కావాలని ఉద్దేశపూర్వకంగా పార్టీ కార్యకలాపాలను తనకు తెలియకుండా నిర్వహిస్తున్నారని మండల స్థాయి సమావేశాల్లో సైతం తనను దూరం పెడుతున్నట్టు ఆవేదన చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు వ్యక్తిగత పోకడలతో తనను దూరం పెడుతున్న కారణంగా మనస్థాపంతో టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్ష పదవికి, టీఆర్ఎస్ శాశ్వత సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. తన రాజీనామాను స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందించనున్నట్లు తెలియజేశారు.