మన దేశంలో వాట్సాప్‌లో ఎక్కువగా ప్రచారమవుతున్న నకిలీ వార్తల వల్ల ఎంతటి నష్టం కలుగుతుందో అందరికీ తెలిసిందే. చాలా మంది నకిలీ వార్తల వల్ల ప్రాణాలను కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అందుకనే సోషల్ మీడియాలో.. ముఖ్యంగా వాట్సాప్‌లో నకిలీ వార్తలు వ్యాప్తి చెందకుండా చూడాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థకు ఆదేశించగా వాట్సాప్ ఆ మేరకు పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికీ నకిలీ వార్తల వ్యాప్తి ఆగడం లేదు. అయితే కనీసం అలాంటి వార్తలను పంపే వారిని ట్రాక్ చేద్దామన్నా సైబర్ పోలీసులకు వీలు కావడం లేదు.

ఎందుకంటే- వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. వాట్సాప్‌లో ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ వల్ల పంపే వారికి, అందుకునే వారికి తప్ప ఇతరులకు మెసేజ్‌లు కనిపించవు. అలాగే వాటిని ట్రాక్ కూడా చేయలేం. దీంతో నకిలీ వార్తలను పంపే వారిని ట్రాక్ చేయడం కష్టతరమవుతోంది. అయితే ఈ ఇబ్బందిని అధిగమించేందుకు వాట్సాప్‌లో డిజిటల్ ఫింగర్‌ప్రింట్ అనే ఫీచర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఫేస్‌బుక్‌కు తాజాగా సూచనలు చేసింది. డిజిటల్ ఫింగర్ ప్రింట్ ఫీచర్ వల్ల ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నప్పటికీ ఒకరు పంపే మెసేజ్‌లను సులభంగా ట్రాక్ చేసేందుకు వీలవుతుంది. అయితే దీని వల్ల ఒకరి మెసేజ్‌లను మరొకరు చూసేందుకు సాధ్యం కాకపోయినా సోషల్ మీడియా యూజర్లపై ప్రభుత్వ నిఘా పెరుగుతుంది. దీంతో అది యూజర్ల ప్రైవసీని దెబ్బ తీసే అవకాశం ఉందని ఫేస్‌బుక్ భావిస్తోంది. ఈ క్రమంలో వాట్సాప్ నకిలీ వార్తలను పంపే వారిని ట్రాక్ చేసేందుకు మరో ప్రత్యామ్నాయ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుందని తెలుస్తోంది..!