రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ శాకాహారి వెజిటేరియన్ ఫుడ్ ఆర్డరిస్తే, అందులో మాంసం ముక్కలు దర్శనమిచ్చాయి. ఎంతో ఇష్టంగా తిందామనుకున్న వెజ్‌ బిర్యానీలో నాన్‌వెజ్‌ కనిపించడంతో షాకైన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో చోటుచేసుకుంది. అక్షయ్‌ దూబే అనే వ్యక్తి విజయ్‌ నగర్‌ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లి వెజ్‌ బిర్యాని ఆర్డర్‌ చేశాడు. అసలే ఆకలి మీదున్న అక్షయ్‌ టేబుల్‌ మీదకొచ్చిన ఘుమఘుమలాడే వెజ్‌ బిర్యానీని ఓ పట్టున లాగేస్తున్నాడు. అయితే ఒక్కసారిగా బిర్యానీలో మాసం బొక్కలు కనిపించడంతో అతడు కంగుతున్నాడు.

వెంటనే ఈ విషయాన్ని రెస్టారెండ్‌ మేనేజర్‌, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా పొరపాటు జరిగిందంటూ వారు క్షమాపణలు తెలియజేశారు. అంతేగాక ఆక్షయ్‌ విజయ్‌ నగర్‌ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశాడు. శాఖాహారులకు మాంసాహారం అందిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రెస్టారెంట్‌ ‌ యజమాని స్వప్నిల్‌ గుజరాతీపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని తదుపరి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసల్‌ సంపత్‌ ఉపాధ్యాయ తెలిపారు.