శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న భైరవకోన వద్ద అర్ధరాత్రి పూజలు నిర్వహించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇలాంటి వాటిని నియంత్రించాల్సిన ఆలయ సీఎస్‌వో, ఏఈవో హోదాలో పనిచేస్తున్న అధికారి ఇందుకు ప్రోత్సహించడం మరింత కలకలంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి బుధవారం పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.

శ్రీకాళహస్తి గ్రామీణ రక్షణాధికారి తిమోతి కథనం ప్రకారం: శ్రీకాళహస్తి మండలం వేడాం గ్రామానికి సమీపంలో ముక్కంటి ఆలయానికి అనుబంధంగా భైరవస్వామి ఆలయం ఉంది. స్థానికులతో పాటు తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చే భక్తులు పలువురు ఇక్కడి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్తుంటారు. మంగళవారం అర్ధరాత్రి కార్తిక అమావాస్యను పురస్కరించుకుని తమిళనాడుకు చెందిన శివమురుగన్‌(55), రమేష్‌కుమార్‌ (48), నందకుమార్‌ (43), ఎం.వెంకటేష్‌ (38), కె.రామన్‌ (42), పి.రామప్రభు (41) భైరవకోనలోని శివలింగం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు.

ఈ విషయమై శ్రీకాళహస్తి గ్రామీణ పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు వెళ్లి వీరితోపాటు తీసుకువచ్చిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూజల నిర్వహణకు ముక్కంటి ఆలయ ఏఈవో ధనపాల్‌ అనుమతి ఇచ్చారని, ఆయన ఆదేశాల మేరకు ప్రభాకర్‌, వెంకటేష్‌ భద్రతా సిబ్బంది సహకారం అందించినట్లు తమిళనాడు భక్తులు తెలిపారు. పోలీసులు ధనపాల్‌తో పాటు భద్రతా ఉద్యోగులను విచారించారు. డీఎస్పీ నాగేంద్రుడి ఆదేశాల మేరకు వీరిపై కేసులు నమోదు చేశారు.