సెల్ఫీ సరదా పలు కుటుంబాల్లో ఘోర విషాదం మిగిల్చింది. బాలున్ని కాపాడబోయి నవవధువు, అతని అక్కలు నదిపాలయ్యారు. కొత్తగా పెళ్లయిన దంపతులు బంధువుల ఇంటికి వెళ్లి, సరదాగా నదీ సందర్శనకు వెళ్లినప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. తమిళనాడు లోని ఊత్తంగేరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. మృతులను నవ వధువు నివేధ, బంధువులు స్నేహ, కనికా, సంతోష్‌గా గుర్తించారు. చివరి ముగ్గురు తోబుట్టువులు కావడం గమనార్హం.

వివరాలు: క్రిష్ణగిరి జిల్లా బర్గూరు మారియమ్మ ఆలయ వీధికి చెందిన గోవిందన్‌ కొడుకు పెరుమాళ్‌స్వామి. దుస్తుల వ్యాపారి. అదే ప్రాంతానికి చెందిన వేలుమణి కూతురు నివేధ (20)తో పెరుమాళ్‌స్వామికి గత నెల 12వ తేదీన పెళ్లి జరిగింది.కొత్త దంపతులు బంధువుల ఇంట్లో విందులకు వెళ్లి వస్తుండేవారు. ఆదివారం ఊత్తంగేరి సమీపంలోని ఒట్టపట్టి గ్రామంలోని బంధువు ఇళంగోవన్‌ ఇంటికి విందుకెళ్లారు. విందు ముగించుకొని ఇళంగోవన్‌ కూతుర్లు స్నేహ (19), కనికా(18), కొడుకు సంతోష్ (14), మరో బంధువుల అమ్మాయి యువరాణి (20) కలిసి ఊత్తంగేరిలోని ఓ సినిమాకు వెళ్లారు.

సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సినిమా చూసిన తరువాత సమీపంలో ప్రవహిస్తున్న పాలారు నది అందాలను చూసేందుకెళ్లారు. ఈ సమయంలో బాలుడు సంతోష్‌ నదీ ఒడ్డున సెల్పీ తీసుకొంటూ కాలు జారి నదిలో పడ్డాడు. అతన్ని రక్షించేందుకు అక్కలు స్నేహ, కనికాతో పాటు నూతన వధువు నివేధలు నదిలో దిగారు. అయితే వారికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోసాగారు. గమనించిన పెరుమాళ్‌స్వామి వెంటనే నదిలో దూకి నదిలో కొట్టుకెళ్లుతున్న ఐదు మందిని కాపాడేందుకు ప్రయత్నం చేశాడు. వీలుకాకపోవడంతో యువరాణిని మాత్రం ప్రాణాలతో బయటకు తీశాడు.

వెంటనే చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని నదిలో కొట్టుకెళ్లుతున్న నివేధ, స్నేహ, కనికా, సంతోష్ లను బయటకుతీసేలోపే ప్రాణాలు వదిలారు. విషయం తెలుసుకొన్న బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని రోధించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది.