పట్టణ శివారులో నిర్మిస్తున్న స్మశాన వాటిక పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె పానగల్ రోడ్డు లో ఉన్న స్మశాన వాటికను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. వేచియుండు గదిపై రేకులు వేయాలని, విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని, స్మశాన వాటికకు సి సి రోడ్డు ఏర్పాటు చేయాలని, అసంపూర్తి ప్రహరీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని, రంగులు వేయించాలని, అంతేకాక స్మశానవాటికలో భూమి చదును చేయించాలని మున్సిపల్ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి ని ఆదేశించారు.

మున్సిపల్ ద్వారా చేపట్టే పనులకు ఇసుక కొరత ఉందని కమిషనర్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, టి ఎస్ ఎన్ డి సి నుంచి వనపర్తి మున్సిపాలిటీ కి ఇసుకను తీసుకునేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని, అలా తెప్పించిన ఇసుకను కాంట్రాక్టర్లకు ఇవ్వాలని, అలాగే మహిళా సంఘాల ద్వారా కూడా ఇసుక సరఫరా చేయిస్తే వారికి కూడా ఆదాయం వస్తుందని జిల్లా కలెక్టర్ సూచించారు. మున్సిపల్ ఇంజనీర్ సందీప్, గోపాల్, కాంట్రాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.