తహశీల్దార్‌ హత్యకు సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్‌ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం రెవెన్యూ ఉద్యోగులతో కలిసి జాతీయ రహదారిపై ఎంపీ బైఠాయించారు. భూప్రక్షాళన పేరుతో గత 60, 70 సంవత్సరాల భూసమస్యలను కొంతమేరకే పరిష్కరించారని, మిగిలిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని పేర్కొన్నారు.

దీంతో రెవెన్యూ ఉద్యోగులు ఆయా భూసమస్యలను పరిష్కరించ లేకపోవడంతో ప్రజలు వీరిపై కక్ష పెంచుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యమే విజయారెడ్డి హత్యకు కారణమని, విజయారెడ్డికి గత ఆరు నెలలుగా వచ్చిన ఫోన్‌ కాల్స్‌పై విచారణ జరిపితే అసలు దోషులు బయటపడతారని అన్నారు. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. హతురాలి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎంపీ డిమాండ్‌ చేశారు.

ఈ ఆందోళనలో తహశీల్దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్, వీఆర్‌ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, టీఎన్‌జీఓ జిల్లా నాయకుడు యశ్వంత్, తహశీల్దార్లు సుశీల, శైలజ, సుచరిత, సీహెచ్‌ సుజాత, ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.