గోదావరి పడవ ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. తిరుపతికి చెందిన సుబ్రమణ్యం(45), మధులత(40) దంపతుల కుమార్తె హాసిని(12) సహా పడవ ఎక్కారు. తన తండ్రి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు వచ్చిన సుబ్రహ్మణ్యం, ఈ కార్యక్రమం అనంతరం పాపికొండల అందాలను వీక్షించేందుకు కుటుంబంతో సహా బోటులో బయలుదేరారు. అయితే దేవీపట్నం వద్ద గోదావరిలో బోట్‌ బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి మధులత బయటపడగా.. సుబ్రమణ్యం, హాసిని గల్లంతయ్యారు. ఈ క్రమంలో నిన్న హాసిని మృతదేహం బైటపడింది. ఆమె తండ్రి సుబ్రహ్మణ్యం డెడ్ బాడీకోసం వెదుకులాట కొనసాగుతోంది.

జూపార్క్ కి వెళ్లి ఉంటే బతికుండేది:

‘నేను రాను డాడీ స్కూల్‌ ఫ్రెండ్స్‌తో కలిసి జూ పార్క్‌కు వెళ్తా’నని దుర్గం హాసిని (12) మారాం చేసింది. తాత అస్థికల్ని నిమజ్జనం చేయడానికి అందరం వెళ్లాలని తండ్రి సుబ్రహ్మణ్యం బలవంతం చేయడంతో తల్లిదండ్రులతో కలసి బయలుదేరింది. కుమార్తె ఇక లేదని తెలిసి తల్లి మధులత గుండెలు బాదుకుంటూ తల్లడిల్లుతోంది. తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యం సొంతూరు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వేపనపల్లి. ఆ చిన్నారి తిరుపతి స్ప్రింగ్‌ డేల్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతోంది. పాఠశాల యాజమాన్యం విద్యార్థులందరినీ శనివారం జూ పార్క్‌ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ రోజు తమతో కలిసి జూ పార్క్‌కు వచ్చి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.