హెల్మెట్ ధరించలేదంటూ కారు యజమానికి పోలీసులు జరిమానా విధించిన సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. కాగా ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిజానికి కారు నడిపే వ్యక్తికి హెల్మెట్ తో ఎలాంటి అవసరం లేదు, అలాంటిది హెల్మెట్ లేదని జరిమానా విధించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. దీంతో కారు యజమాని అవాక్కయి నేరుగా కమిషనర్‌ కార్యాలయంలో శనివారం ఫిర్యాదు చేశారు.

పూర్తి వివరాలు: చెన్నై కొట్టివాక్కం ప్రాంతానికి చెందిన న్యాయవాది భరణీశ్వరన్‌. ఇతని భార్య నందిని. గత 25వ తేదీ ట్రాఫిక్‌ పోలీసు శాఖ నుంచి భరణీశ్వరన్‌కు ఒక ఎస్‌ఎంఎస్‌ అందింది. అందులో ద్విచక్ర వాహనంలో హెల్మెట్‌ ధరించకుండా వెళ్లినందుకు రూ.100 రూపాయలు అపరాధం చెల్లించాలని ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కారు యజమాని దిగ్భ్రాంతి చెందారు.

ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్‌ ధరించని పక్షంలో వారికి జరిమానా విధించడం పరిపాటి. అయితే కారు యజమానికి హెల్మెట్‌ జరిమానా మెసేజ్‌ రావడంతో సంచలనం కలిగించింది. దీంతో కారు యజమాని సంబంధిత ట్రాఫిక్‌ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా సరిగా స్పందించకపోవడంతో శనివారం ఆయన నేరుగా కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపడతామని అధికారులు తెలిపారు…