హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఈ నెల 3న జరగనున్న భాజపా విజయ సంకల్ప సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 4 లక్షల చదరపు అడుగుల్లో 10 భారీ జర్మన్‌ టెంట్లు అమరుస్తున్నారు. ప్రధానమంత్రి వేదికతోపాటు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయస్థాయి నేతలు, వీవీఐపీ, వీఐపీలకు సంబంధించిన వేదికలను దాదాపుగా పూర్తి చేశారు. ప్రధాన వేదికతోపాటు ప్రముఖులకు సంబంధించిన షెడ్లు, గుడారాలలో 100 ఏసీలను అమర్చారు.

50 జనరేటర్లను, 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. 2 లక్షలమంది కూర్చునేందుకు వీలు కల్పించారు. 30 ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాట్లను చేసి ప్రసంగాలు స్పష్టంగా వినపడేలా, వక్తలు కనబడేలా ఏర్పాట్లు చేశామని ఆర్‌కే ఈవెంట్స్‌ అధినేత రామకృష్ణ తెలిపారు. ఇక మైదానంలో ఉండేవారితోపాటు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి సైతం ప్రధాని ప్రసంగం వినిపించేలా స్పీకర్లను ఏర్పాటు చేయనున్నారు.

పార్కింగుకు నాలుగు మైదానాలుః

సభకు హాజరయ్యేవారి వాహనాలను పార్కింగు కోసం కంటోన్మెంట్‌ బోర్డు జింఖానా మైదానం, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ మైదానం, బైసన్‌పోలో మైదానం, మడ్‌ఫోర్ట్‌లోని హాకీ మైదానంతోపాటు జేబీఎస్‌ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో వెసులుబాటు కల్పించారు. ఆయా మైదానాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కంటోన్మెంట్‌ పారిశుద్ధ్య కార్మికుల బృందాలతో అధికారులు శుభ్రం చేయించారు.