తాగిన మైకంలో ఒంటరిగా ఉన్న మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 39 ఏళ్ల వ్యక్తిని స్ధానికులు కొట్టిచంపారు. జలంధర్‌లోని రామ మండి ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన వెలుగుచూసింది. బాలిక తల్లితండ్రులు కూలి పనులకు వెళ్లడంతో పొరుగునే ఉన్న ఇంట్లోకి చొరబడిన నిందితుడు 11 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. బాలిక కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్ధానికులు నిందితుడిని చితకబాదారు.
లైంగిక​దాడి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలికను ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని స్ధానికులు తీవ్రంగా కొట్టడంతో ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మరణించాడని చెప్పారు. ఆధార్‌ కార్డు ద్వారా మృతుడిని గుర్తించిన పోలీసులు ఆయన కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నారు. కాగా నిందితుడి మూక హత్యపై ఇంతవరకూ ఎవరిపై కేసు నమోదు చేయలేదని ఏసీపీ హర్‌సిమ్రత్‌ సింగ్‌ తెలిపారు.