ప్రస్తుత కాలంలో ఎవరైనా దంపతులు ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు చాలనుకుంటారు. కానీ, ఇందుకు భిన్నంగా మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ ఏకంగా 20 సార్లు గర్భం దాల్చింది. ఆమెకు వైద్యం అందిస్తున్న డాక్టర్ అశోక్ థోరాట్ తెలిపిన వివరాల ప్రకారం: బీడ్ జిల్లాలోని గోపాల్ కమ్యూనిటీకి చెందిన లంకాబాయి ఖారత్ అనే 38 ఏళ్ళ మహిళ ప్రస్తుతం ఏడవ నెల గర్భంతో ఉంది. ఆమెకిది 20వ గర్భం కావడం విశేషం ఇప్పటి వరకు ఆమె 16 మంది పిల్లలకు జన్మనిచ్చింది. వీరందరూ నార్మల్ డెలివరీతోనే జన్మించారు. వారిలో ఐదుగురు పిల్లలు పుట్టిని కొన్ని గంటల వ్యవధిలోనే మృతిచెందారు. ఆమెకు మూడుసార్లు మూడు నెలలు గర్భం నిలిచిన తరువాత గర్భస్రావమైంది. ఇప్పుడు ఆమెకు 11 మంది సంతానం. ప్రస్తుతం బీడ్ జిల్లా ఆసుపత్రి వైద్యులు ఆమెకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. త్వరలో ఆమెకు 17వ డెలివరీ జరగనుంది. వరుస కాన్పుల వలన గర్భసంచి బలహీనపడిందని, అధిక రక్త స్రావం కూడా జరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.