రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈనెల 28న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత ఈనెల 27న రావాలనుకున్నా ఆరోజు అష్టమి కారణంగా పర్యటనలో స్వల్ప మార్పులు చేశారని తెలిసింది. మహబూబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్, వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో మంత్రి దయాకర్‌రావు సమావేశమై 28న జిల్లా పర్యటనకు వస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, రెడ్యానాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్‌ తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, శంకర్‌నాయక్, తెరాస మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి తదితరులతో మంత్రి హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. గురువారం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి జనగామ జిల్లా పెంబర్తికి చేరుకుంటారు. అక్కడి నుంచి తెరాస శ్రేణులు ఘన స్వాగతం పలకాలని ఏర్పాట్లు చేస్తున్నారు. జనగామ పట్టణం నుంచి మంత్రి భారీ కాన్వాయ్‌తో వరంగల్‌ నగరానికి చేరుకుంటారు. మడికొండ నుంచి కాజీపేట, హన్మకొండ నుంచి వరంగల్‌ ఓసిటీ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహిస్తారు. అజంజాహి మిల్లు మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. సభను విజయవంతం చేయడానికి తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ బాధ్యత తీసుకున్నారు.