అతడి వృత్తి బాధ్యతాయుతమైన బ్యాంకు ఉద్యోగం. ప్రవృత్తి మహిళలను లోబరుచుకుని ఉల్లాసంగా గడపడం. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 40 మందికి పైగా మహిళలతో భర్త సాగించిన రాసలీలను ఫొటోలు, వీడియోల ఆధారాలతో తాళి కట్టిన భార్యే బట్టబయలు చేసింది. అరెస్ట్‌ భయంతో భర్త సహా ఐదుగురి కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారు. ఎడ్విన్‌ జయకుమార్‌ (36) పుదుక్కోట్టై జిల్లా వీరాలిమలైలోని ఇండియన్‌ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. ఓ యువతి (32)తో గత ఏడాది డిసెంబర్‌ 2వ తేదీన వివాహమైంది.

పెళ్లయిన రోజు నుంచే జయకుమార్‌ తన ఇంటిలోని ప్రత్యేక గదిలో గంటల తరబడి పలువురు మహిళలతో అశ్లీలంగా మాట్లాడడం, తనతో సఖ్యతగా ఉండకపోవడాన్ని భార్య గమనించింది. భర్త బ్యాంకుకు వెళ్లిన సమయంలో అతని గదిలోకి వెళ్లి పరిశీలించగా 15 సెల్‌ఫోన్లు, వాటిల్లో జయకుమార్‌ 40 మందికిపైగా మహిళలతో, బ్యాంకు ఖాతాదారులతో అర్ధనగ్నంగా, నగ్నంగా ఉన్న చిత్రాలు, బాత్‌రూములో వీడియోలు, ఎస్‌ఎంఎస్‌లు చూసింది.

భర్తను నిలదీస్తే నీవు స్నానం చేస్తున్నపుడు రహస్యంగా వీడియో తీసి జాగ్రత్తగా దాచిపెట్టాం, ఈ విషయాలు ఎవరికైనా చెబితే ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పెడతాం’ అంటూ జయకుమార్, అతడి సహోద్యోగిని దేవీ బిలోమినా బెదిరించారు. దీంతో ఆ యువతి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా, వారు జయకుమార్‌ను నిలదీశారు.
అయితే తన రాసలీలలను బహిర్గతం చేసిందనే కక్షగట్టిన జయకుమార్‌…భార్యను హతమార్చేందుకు పథకం రచించాడు. ఆలయాల సందర్శన పేరుతో భార్యను బయటకు తీసుకెళ్లి రెండుసార్లు హత్యయత్నం చేశాడు. అతడి బారి నుంచి తప్పించుకుని తంజావూరు సర్కిల్‌ డీఐజీ లోకనాథన్‌కు ఫిర్యాదు చేసింది. డీజీపీ ఆదేశాల మేరకు బాధితురాలి భర్త జయకుమార్, అతని తల్లి విల్లీ హైడా, సోదరి కేథరిన్‌ నిర్మలామేరీ, బంధువు రీటాతో పాటుగా, జయకుమార్‌తో సంబంధం పెట్టుకుని అతడి దుర్మార్గాలకు సహకరించిన బ్యాంకు ఉద్యోగిని దేవీ బిలోమినాపై మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే ఈ విషయాన్ని పసిగట్టిన జయకుమార్‌ మదురై హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పొందాడు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తన భర్త రాసలీలలకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఆధారాలను మదురై కోర్టుకు అప్పగించి వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా కోరింది. బాధితురాలి పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు జామీనుపై విడుదలకు అవకాశం లేని సెక్షన్లతో కేసు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జయకుమార్‌ సహా ఐదుగురిపై వల్లం మహిళా పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న జయకుమార్‌… కుటుంబంతో కలిసి పరారీలో ఉన్నాడు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.