మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకునే వయసులో తల్లి అవడం ఏంటని ఓ వివాహిత బలవంతంగా అబార్షన్ చేయించుకుని ప్రాణాలు పోగొట్టుకుంది. పెళ్లీడుకొచ్చిన కొడుకు, కూతురు, చుట్టుపక్కల వాళ్లు, ఈ వయసులో తల్లివి ఎందుకయ్యావని అడిగితే తానేం సమాధానం చెప్పుకోవాలో తోచక కడుపులో బిడ్డను బలవంతంగా చంపుకోవాలనుకుంది..

Advertisement

వివరాలు: మదనపల్లెలోని అమ్మినేని వీధిలో ఇనాయతుల్లా, ఖదిరున్నీసా(45) దంపతులు దర్జీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పెళ్లీడుకొచ్చిన కొడుకు, కూతురు వున్నారు. ఆమె గర్భం దాల్చిన విషయాన్ని ఇంట్లో ఎవరికి చెప్పకుండా దాచింది. ఎనిమిది నెలలు నిండాయి. కడుపు ఎత్తుగా కనిపించడంతో ఆమెలో మరింత ఆందోళన పెరిగింది. వయసు ప్రభావంతో పొట్ట వచ్చిందని ఇంట్లో వాళ్లు భావించారు. బిడ్డ పుట్టాక విషయం తెలిస్తే పిల్లల ముందు, చుట్టుపక్కల వాళ్ల ముందు తాను చులకన అయిపోతానని వెర్రిగా ఆలోచించింది ఆమె. ఎవరికీ తెలియకుండా కడుపులోని బిడ్డను చంపుకోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్‌రూంలో బలవంతంగా అబార్షన్‌ చేసుకుంది.

వెలికి వచ్చిన ఆడశిశువును ప్లాస్టిక్‌ కవర్లో చుడుతూ అధిక రక్తస్రావం కారణంగా బాత్‌రూంలోనే కుప్పకూలిపోయింది. కాసేపటికి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఇది గమనించి ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే శిశువు మాత్రం బతికింది. శిశువుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఖదీరున్నిసా చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.