రావులపాలెం: గౌతమి గోదావరి పాత బ్రిడ్జిపై నుంచి దూకి రామచంద్రపురానికి చెందిన దూళ్ళ లోవ సత్యనారాయణ(35) ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై వెంకటరమణ తెలిపారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది: రావులపాలెం నుంచి జొన్నాడ వైపు వెళ్లే పాత బ్రిడ్జి పై నుంచి ఒక వ్యక్తి గోదావరిలోకి దూకినట్టు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక మత్స్యకార యువకులతో కలసి బోటుపై గాలించి, గోదావరిలోకి దూకిని వ్యక్తిని గుర్తించి ఒడ్డుకు చేర్చామని చెప్పారు. హైవే అంబులెన్స్‌ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి క్షతగాత్రుడిని కొత్తపేట ఏరియా ఆస్పతికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

మృతుడు సత్యనారాయణకు ఐదేళ్ల క్రితం వివాహం అయ్యిందని, భార్య లావణ్య, నాలుగేళ్ల పాప, ఐదునెలల బాబు ఉన్నారు. తాపీమేస్త్రిగా జీవనం సాగిస్తున్నాడు ప్రస్తుతం భార్య పుట్టింట్లో ఉంది. కొంత కాలంగా సత్యనారాయణ కూడా మావగారి ఇంటి వద్ద పాలకొల్లు సమీపంలోని జొన్నూరులో ఉంటున్నాడు. ఈనెల 18 తేదీన భార్యాపిల్లలను తీసుకుని రామచంద్రపురం వెళదామని నిర్ణయించుకున్నాడు. ఇందు కోసం ఇల్లు శుభ్రం చేసి వస్తానని చెప్పి బుధవారం ఉదయం జొన్నూరు నుంచి బయలుదేరినట్టు భార్య లావణ్య పోలీసులకు తెలిపింది. సత్యనారాయణ తండ్రి దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటరమణ తెలిపారు.