ఆరు నెలల క్రితం అదృశ్యమైన నేపాలీ మహిళ నిర్జీన ప్రాంతంలో అస్థిపంజరంగా కనిపించింది. హుళిమావు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అక్షయనగర అపార్టుమెంట్‌ వెనుకభాగంలో పొదల మధ్య చెట్టుకు వేలాడుతున్న స్థితిలో ఉన్న అస్థి పంజరం నేపాలీకి చెందిన పుష్పదామి (22)గా పోలీసులు గుర్తించారు: నేపాల్‌కు చెందిన పుష్పాదామి, భర్త అమర్‌దామి అక్షయనగరలో నివాసం ఉంటున్నారు. భర్త మద్యానికి బానిస. దీంతో అతన్ని భరించలేక నేపాల్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. గత ఏడాది జులై 8న భర్తపై కోపంతో ఇంటి నుంచి పుష్పదామి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. భార్య కనిపించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పలు ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.

ఈ ఘటనపై ఆగ్నేయ విభాగ డీసీపీ సీకే.బాబా శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ: ఉరి వేసుకున్న స్థితిలో గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో హుళిమావు పరిధిలోని అపార్టుమెంట్‌ వెనుక భాగంలోని పొదల్లో మనిషి తలపుర్రె,అస్థి పంజరం లభ్యమైంది. అస్థిపంజరం పైన పాదరక్షలు, మెడలో ఉన్న నెక్లెస్, ఇతర వస్తువులు అక్కడ పక్కనే లభించాయి. అక్కడ ఎక్కువగా సంచారం లేకపోవడం నిర్జీన ప్రదేశం కావడంతో ఆ వస్తువులు ఎవరూ తీసుకోలేదు. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసిందని సీకే బాబా తెలిపారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.