వరంగల్ జనసంద్రమైన ఐనవోలు జాతర ..

ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం సోమవారం జనసంద్రంగా మారింది. ఆదివారం సాయంత్రం నుంచే జిల్లా నలుమూలల నుంచేగాక పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి బస్సుల్లో, ప్రత్యేక వాహనాల్లో భక్తులు తరలివచ్చారు. భక్తులు ఒగ్గుపూజారులతో బోనాలు, పట్నాలు వేసి స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు సమర్పించారు.

ఆకట్టుకున్న శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు..

కొందరు భక్తులు ఎల్లమ్మ దేవాలయం వద్ద నివేదన చేశారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పోలీసులు, అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

మాజీ డిప్యూటీ సీఎం కడియం, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, మల్లారెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.

  • ఐనవోలు మల్లన్న శరణజొచ్చుతమంటూ భక్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కాకతీయుల ఆరాధ్య దైవంగా మల్లన్న ఆలయం ప్రసిద్దికెక్కింది. ఈ ఆలయాన్ని దర్శించుకోడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు నాలుగు నెలలపాటు ఈ జాతర కొనసాగుతుంది.