గూగుల్ రెండో అతిపెద్ద క్యాంపస్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. సంస్థ నిర్మించబోయే బిల్డింగ్ కు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకుంది. అమెరికాలోని సంస్థ ప్రధాన కార్యాలయం తర్వాత ఇంత పెద్ద క్యాంపస్ ను గూగుల్ సంస్థ హైదరాబాద్ లోనే ఏర్పాటు చేయబోతుంది. 22 అంతస్థుల భవనం నిర్మాణం కోసం ఇప్పటికే పర్యావరణ అనుమతులు కూడా పొందింది. సుమారు 13,000 మంది ఉద్యోగులు ఈ క్యాంపస్ లో పనిచేయనున్నారు. దీనిపై గూగుల్ సంస్థ 1,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. గ్రౌండ్ ఫ్లోర్ లోనే పార్కింగ్ వసతులు కల్పించే విధంగా భవనాన్ని నిర్మించనున్నారు. 22 అంతస్థుల ఈ భవనం సోలార్ పవర్ నే వినియోగించుకోవాలని సంస్థ భావిస్తోంది. దీనికి సంబంధించిన గూగుల్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య 2015లోనే ఒప్పందం కుదిరింది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం 7.2 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో భాగంగానే 2018లోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ , పర్యావరణ అనుమతులు పొందింది.